కరీంనగర్ : దేశంలో జరిగిన అన్ని అనార్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని కరీంనగర్ ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్(Ghulam Ahmed) అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని దారుస్సంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్న బాధలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చెందారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. కార్పొరేటర్ మీటింగ్ కు వచ్చిన జనం కూడా రాహుల్ సభకు రాలేదంటే, ఆయన చరిష్మా ఏమేరకు దిగజారిందో అర్ధమవుతుందన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీని తెలంగాణలో గెలవకుండా నిలువరించామని, 2023 లోను బీజేపీని అసెంబ్లీ ఎన్నికలలో గెలవకుండా మట్టి కురిపించే సత్తా కేవలం ఎంఐఎం పార్టీకే ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక, ఎంఐఎం పార్టీ విస్తరిస్తుందనే కుటిల బుద్ధితో రాహుల్ అసత్య ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు.