Hyderabad | మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 18: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో పుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు సందర్భంగా సామగ్రి ఉండగానే తమ షాపులను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు షెడ్లు, ఇతర నిర్మాణాలను రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు నడుమ అధికారులు బుధవారం కూల్చివేశారు.
కనీసం తమకు సామగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా షాపులను ఎలా కూలుస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని పక్కకు తప్పించి యథావిధిగా కూల్చివేతలు చేపట్టారు. రహదారికి ఓవైపున ఉన్న షాపులను, ఇతర నిర్మాణాలను కూల్చిన అధికారులు, మరోవైపున ఫుట్‌పాత్‌ను ఆనుకొని ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ జోలికి వెళ్లకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. పెద్దల జోలికి వెళ్లకుండా అధికారులు పేదలమైన తమ బతుకులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
కూల్చివేతల విషయం తెలిసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అకారణంగా ప్రజల ఆస్తులను కూల్చివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఇదే ప్రాంతంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ భవనాలు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్వేనని స్థానికులు చెప్తున్నారు. వాటి జోలికి అధికారులు వెళ్లకుండా ఉండేందుకే ఆయన వచ్చారని అంటున్నారు. ఎమ్మెల్యే రాగానే అధికారులు సైతం కూల్చివేతల ప్రక్రియను నిలిపివేయడం గమనార్హం.