హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అత్యంత పారదర్శకంగా ఆస్తులను ట్యాక్స్ నెట్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు నూతనంగా ఆన్లైన్ ప్రక్రియకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. కొనుగోలు చేసిన నూతన ఆస్తి అసెస్మెంట్, మ్యుటేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకుగానూ ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ అయిన పాత ఆస్తికి ఇంతకుముందు జారీ చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు), వేకెంట్ ల్యాండ్ నంబర్ ఆటోమేటిక్‌గా ఎలాంటి మార్పు లేకుండా అదే నంబర్‌తో నూతన యజమాని పేర నమోదు కానుంది. కొత్త ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న పిదప అసెస్మెంట్ కానీ పక్షంలో ఆస్తి పన్నుకు, ఖాళీ స్థలానికి నూతనంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, వేకెంట్ ల్యాండ్ నంబర్లను కేటాయించనున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సూచించిన ఆస్తి విలువ ప్రకారంగా ఆస్తి పన్ను అసెస్మెంట్, ఖాళీ స్థలం పన్ను అసెస్మెంట్ను నిర్ధారిస్తామని వెల్లడించారు. నివాస గృహాలకు జూబ్లీహిల్స్‌లో చదరపు అడుగుకు రూ.1.25 పైసల చొప్పున, మిగతా ప్రాంతాలకు రూ.1 చొప్పున ఆస్తి పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వేకెంట్ ల్యాండ్ అయిన పక్షంలో రిజిస్ట్రేషన్ విలువలో 0.50 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు.