Geriatric Clinics | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : 65 ఏండ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జీరియాట్రిక్ క్లినిక్‌లు ఏర్పాటుచేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ దవాఖానల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. వీటిలో ఓపీ, ఐపీ సేవలు అందించనున్నారు. ఇన్‌పేషంట్ల కోసం ఒక్కో క్లినిక్‌లో 30 బెడ్లు ఏర్పాటుచేస్తారు. ఈ క్లినిక్‌లలో ఆర్థో, సైకలాజికల్, ఈఎన్టీ, జనరల్ ట్రీట్మెంట్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ మేరకు డీఎంఈ నరేంద్రకుమార్ అన్ని జిల్లాల మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు.
చాలామంది పేరెంట్స్‌ను పట్టించుకోకపోవడం, వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. క్షేత్రస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖాన్లలోని స్టాఫ్, ఆశలు, ఏఎన్ఎంల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా వృద్ధులను గుర్తించి జిల్లా స్థాయిలోని జీరియాట్రిక్ క్లినిక్‌కు పంపిస్తారు. హెల్త్ కండీషన్‌పై ప్రతినెలా క్షేత్రస్థాయి హెల్త్స్టాఫ్ ఆయా క్లినిక్‌లకు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో వృద్ధుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు తీసుకురావచ్చని డీఎంఈ నరేంద్రకుమార్ స్పష్టంచేశారు. ఇక ఈ క్లినిక్‌లకు నోడల్ కేంద్రంగా నిమ్స్ వైద్యశాల పనిచేయనున్నది. క్లినిక్‌లకు వచ్చిన క్రిటికల్ కండీషన్ పేషెంట్లను రెఫరల్ విధానంతో నిమ్స్‌కు షిఫ్ట్ చేయనున్నారు. మరికొన్ని కేసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ల ప్రొఫెసర్ల బృందం పనిచేయనున్నది.