హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా ఎదురవుతాయని, వాటి పరిష్కారానికి పరిశోధనలు సాగాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలిపారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐదు రోజుల ఐక్యరాజ్యసమితి రెండో జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్‌లో మూడో రోజైన బుధవారం పలు అంశాలపై చర్చలు కొనసాగాయి. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రంగం విస్తృతికి కావాల్సిన పాలసీల రూపకల్పనలో పారదర్శకత, దానికి గల భవిష్యత్తు అవకాశాలపై వివిధ దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ తరువాత జరిగిన సెషన్లలో జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఉపయోగాల ప్రచార ఆవశ్యకత, జాతీయ ప్రాధాన్యాలకు ఇవ్వాల్సిన మద్దతు, టెక్నాలజీ అభివృద్ధిలో సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం తదతర అంశాలపై చర్చలు కొనసాగాయి. సాయంత్రం వేళ పలు సంస్కాతృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఐఐటీల స్టార్టప్‌ల అద్భుత ప్రాజెక్టులు
సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు ప్రముఖ ఐఐటీ కాలేజీలు తరలివచ్చాయి. ఐఐటీ హైదరాబాద్, జోధ్‌పూర్, కాన్పూర్, తిరువనంతపురం, ఢిల్లీతో పాటు పలు కాలేజీలు స్టాళ్లను ఏర్పాటుచేశాయి. అదేవిధంగా వివిధ రాష్ర్టాలకు చెందిన స్టార్టప్ కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటుచేశాయి. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తాము ఇప్పటికే అభివృద్ధి చేసిన, ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులను వివరించాయి. రక్షణరంగం, వాతావరణం, పర్యావరణం, జల సంరక్షణతోపాటు, పలు విపత్తుల వల్ల వాటిల్లే నష్టాలను తగ్గించేందుకు దోహదపడే సాంకేతికతనుఅవి అభివృద్ధి చేయడం విశేషం. ఆయా ప్రాజెక్టుల వివరాలను తెలుసుకొని విద్యార్థులు, వివిధ దేశాల ప్రతినిధులు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తెలంగాణ రిమోట్ అప్లికేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన ప్రాజెక్టు గురించి వారు చాలా ఆసక్తిగా తెలుసుకున్నారు. సదస్సుకు నగరంలోని ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తరలిరాగా డ్రాయింగ్ ఫెస్ట్‌ను నిర్వహించారు. అదేవిధంగా సదస్సు ప్రాంగణంలో హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్ బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.