Genome Valley | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జీనోమ్ వ్యాలీ.. అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రం మాత్రమే కాదు, అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తయారు చేసింది. లైఫ్ సైన్సైస్ రంగానికి సంబంధించి మంచి ఆలోచన. నెలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టగలిగే స్థోమత ఉంటే చాలు.. కంపెనీలకు అధిపతులుగా మారే అవకాశాన్ని జీనోమ్‌వ్యాలీ కల్పిస్తున్నది. అంతేకాదు, ప్రపంచాన్ని ఆదుకున్న కొవాగ్జిన్ వంటి టీకా పరిశోధనలు మొదలు.. సీసాల్లో ప్యాక్ అయ్యి బయటికి వచ్చేదాకా జీనోమ్ వ్యాలీలోనే జరిగింది. ఇలాంటి ఎన్నో విజయాలు ఈ క్లస్టర్ సొంతం.
అండగా నిలుస్తున్న ఐకేపీ నాలెడ్జ్ పార్క్
చిన్న స్టార్టప్‌తో మొదలు పెట్టాలనుకునే వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా నాలెడ్జ్ పార్కులు అద్భుతమైన సహకారం అందిస్తున్నాయి. ముఖ్యంగా లాభాపేక్ష లేని సంస్థ ‘ఐకేపీ నాలెడ్జ్ పార్క్’ స్టార్టప్‌ల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నది. ఈ నాలెడ్జ్ పార్క్ మొత్తం 200 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఇందులో రెండు ఇంక్యుబేటర్లు ఉన్నాయి. ఆర్ అండ్ డీలో స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలనుకునేవారికోసం కేవలం వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో అంటే.. డబుల్ బెడ్ రూం ఫ్లాట్ విస్తీర్ణంలో ఇక్కడ ల్యాబొరేటరీలు లీజుకు దొరుకుతున్నాయి. అంతేకాదు, పరికరాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబులు ఈ నాలెడ్జ్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి.
చక్కటి ఆలోచన ఉంటే చాలు
సరైన ఆలోచనతో వస్తే చాలు జీనోమ్ వ్యాలీలో నేరుగా పరిశోధనలు ప్రారంభించవచ్చు. ల్యాబ్ ఫీజు కూడా నెలకు నామమాత్రంగా దాదాపు రూ.25 వేలకు కాస్త అటూఇటుగా ఉన్నది. ఒకరిద్దరు వర్కర్లు, మెయింటెనెన్స్, లీజు ఇలా కలుపుకొంటే నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు మాత్రమే ఖర్చవుతుంది. లీజు గరిష్ఠంగా మూడు సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే ఆ తర్వాత పొడిగించుకోవచ్చు. ఇక్కడి పరిశోధనలు సక్సెస్ అయితే వ్యాపారవేత్తల దృష్టిలో పడతారు. పెట్టుబడులు వస్తాయి. ఐకేపీ నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 65కు పైగా స్టార్టప్‌లను పరిచయం చేయగా, ఇందులో 18 స్టార్టప్‌లు పెట్టుబడులను సాధించి, సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టాయి. మిగతా 47 స్టార్టప్‌లు వివిధ కంపెనీలకు పరిశోధన సహకారాన్ని అందిస్తున్నాయి.
లీజు స్థలాలకు విపరీతమైన డిమాండ్
ప్రారంభ దశలో కంపెనీని ఏర్పాటు చేయాలనుకునేవారి కోసం ఇక్కడ ఇన్నోవేషన్ పార్కుల్లో స్థలాలు లీజుకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 30 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు అందుబాటులోకి వచ్చింది. అవన్నీ నిండిపోగా, ఇప్పుడు మరో 20 లక్షల చదరపు అడుగుల స్థలం సిద్ధం అవుతున్నది. బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహిస్తున్న పార్క్‌లో కొత్త బ్లాక్ పనులు తుది దశలో ఉన్నాయి. అప్పటికే 50 శాతానికిపైగా స్థలానికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. దీనిని బట్టే ఇక్కడి స్థలాల లీజుకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.
జీనోమ్ వ్యాలీకి బడా కంపెనీలు
కంపెనీ కార్యకలాపాలు పెరిగిన తర్వాత ప్రత్యేకంగా భూమి కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రాగానే సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. బడా కంపెనీలైతే నేరుగా జీనోమ్ వ్యాలీకి వచ్చి భూములను తీసుకొని, తమ ఆర్ అండ్ డీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
లారస్.. ఒక మచ్చుతునక
లారస్ ల్యాబ్స్.. దేశీయ ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటి. దీని విలువ రూ.17 వేల కోట్లకు పైనే. టర్నోవర్ రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది జీనోమ్ వ్యాలీ విజయాలకు ఒక మచ్చుతునక. ఈ కంపెనీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో తెలుసా? ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో. కేవలం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోని ల్యాబ్‌లో మొదలైంది. డాక్టర్ చావ సత్యానారాయణ, వెంకట రవికుమార్ కలిసి దీనిని ప్రారంభించారు. స్టార్టప్ విజయవంతం కావడంతో కంపెనీ విస్తరణ మొదలైంది. ఇప్పుడు జీనోమ్ వ్యాలీలో కంపెనీకి సొంతంగా ఆర్ అండ్ డీ సెంటర్ ఉన్నది. ఏపీలోని విశాఖపట్నంతోపాటు అమెరికాలోనూ సొంతంగా ఆర్ అండ్ డీ సెంటర్లు ఏర్పాటు చేసింది. కంపెనీకి 2020లో అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి వచ్చింది. కంపెనీలో సమారు 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ప్రపంచానికి భరోసా
కొవిడ్ సమయంలో ప్రపంచానికి భరోసా కల్పించిన క్లస్టర్లలో జీనోమ్ వ్యాలీ ముఖ్యమైనది. ఇక్కడి భారత్ బయోటెక్ యూనిట్లో కొవిడ్ వైరస్‌పై పరిశోధనలు మొదలు.. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, ప్యాకింగ్ ఇలా అన్ని దశ లు ఇక్కడే పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి నేరుగా దేశ విదేశాలకు ఎగుమతి అయ్యాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టీకాగా కొవాగ్జిన్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. బయోలాజికల్-ఈ, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్లోనూ కొవిడ్‌పై విశేష పరిశోధనలు జరిగాయి. బయోలాజికల్-ఈ సొంతంగా కార్బేవ్యాక్స్ టీకాను అభివృద్ధి చేసింది.