హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : సివిల్స్ ఫలితాలు, ఉద్యోగాల్లో మహిళల హవా.. కొనసాగుతుంటే జాతీయ పోటీ పరీక్ష అయిన జేఈఈలో మాత్రం డీలా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఈ పరీక్షలో తీవ్రమైన జెండర్ గ్యాప్(లింగ భేదం) కనిపిస్తున్నది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ పరీక్షపై ఆసక్తి చూపించడం లేదు. ఏటా ఇదే పునరావృతమవుతున్నది. ఈ సారి జేఈఈ మెయిన్-1కు 13,55,293 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో అమ్మాయిలు 4,67,817(34%) మాత్రమే. అదే అబ్బాయిలు అత్యధికంగా 8,87,476 మంది (66%) జేఈఈకి పోటీపడ్డారు. చాలా కాలంగా ఇదే పరిస్థితి ఉంటున్నది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏటా 2.5లక్షలు క్వాలిఫై అయితే, వీరిలో అమ్మాయిల సంఖ్య 43వేలు మాత్రమే. అంటే అబ్బాయిల సంఖ్య 2లక్షలకు పైగా ఉంటున్నది. అమ్మాయిల సంఖ్య ను పెంచేందుకు ప్రత్యేక కోటా అమలవుతున్నది. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ఏకంగా 20% సీట్లను సూపర్ న్యూమరరీ కోటాలో పొందుపరిచారు. అమ్మాయిలకు జనరల్, ఫిమేల్ ర్యాంక్ రెండింటి ద్వారా సీట్లు పొందే అవకాశముంది.
ఎస్సీ.. ఎస్టీలు కూడా
జేఈఈపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు సైతం అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తు చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఐఐటీల్లో 15% ఎస్సీలకు, 7.5% సీ ట్లు ఎస్టీలకు రిజర్వుచేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్నేండ్లుగా కటాఫ్ పరిశీలిస్తే కనిష్ఠంగా 45%, గరిష్ఠంగా 70% మార్కులుగా ఉన్నాయి.
జేఈఈ మెయిన్‌లో మెరిసిన గురుకుల విద్యార్థులు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. బీసీ గురుకులాలకు చెందిన ఐదుగురు 90 పర్సంటైల్ దాటారు. 28 మంది 80 పర్సంటైల్ కంటే ఎక్కువ స్కోర్ సాధించారు. ఏ నిత్య (92.19), సీహెచ్ గాయత్రి (91.50), ఎం సహస్ర(87.69), పీ చరిత (86.20) పర్సంటైల్‌తో సత్తాచాటారు. వీరిని మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల కార్యదర్శి సైదులు అభినందించారు.
గిరిజన గురుకుల విద్యార్థులు సైతం
ఈ ఫలితాల్లో గిరిజన గురుకుల విద్యార్థులు సైతం సత్తాచాటారు. ఐదుగురు 90 పర్సంటైల్, 27 మంది 90-80 మధ్య పర్సంటైల్ సాధించారు. చౌహన్ ప్రవీణ్ (93.45), అజ్మీరా మహేశ్(91.97), రమావత్ లక్ష్మణ్‌నాయక్ (90.01), బానోత్ కార్తీక్(90.18) పర్సంటైల్ సాధించినట్టు గిరిజన గురుకులాల కార్యదర్శి కే సీతాలక్ష్మి తెలిపారు.