పాల్వంచ/చిక్కడపల్లి, ఏప్రిల్ 9 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు బుధవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి చేపట్టిన సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో గురువారం రెండో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లోనే కార్మికులు రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం నుంచి మళ్లీ సమ్మెను కొనసాగించారు. జెన్కో యాజమాన్యం మాత్రం.. కేటీపీఎస్ ప్రాంగణంలోని సీఈల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీచేసింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఆర్టిజన్లు విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అల్టిమేటం ఇచ్చింది.
అయినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగించారు. కార్మికుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు, జెన్కోలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ మద్దతు పలికాయి. సమ్మెలో సంఘం రాష్ట్ర కన్వీనర్ సాయిలు, కో కన్వీనర్ చంద్రసింగ్ ఠాగూర్, బాలకృష్ణారెడ్డి, వెంపటి అనిల్‌కుమార్, రవీందర్, నర్సిరెడ్డి, వెంకట్రావ్, సాయిబాబా, మసూద్, వెంకటేశ్వర్లు, రమేశ్, శివ యాదవ్, రాజు, శారద, కవిత పాల్గొన్నారు.
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గురువారం హైదరాబాద్‌లోని అజామాబాద్ విద్యుత్తు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ చంద్రారెడ్డి, నాయకులు స్వామి, కత్తి శ్రీను, సైదులుగౌడ్ మాట్లాడుతూ.. వినియోగదారులకు 24 గంటలపాటు విద్యుత్తు సరఫరాను అందించడంలో తాము నిరంతరం పనిచేస్తున్నా ఎలాంటి ప్రయోజనాలు అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్లో అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జేఏసీ నాయకులు శ్రీరాములు, బొడ్డు రమేశ్, మహేందర్ రెడ్డి, హరీశ్, శ్రీకాంత్, ప్రవీణ్, లక్ష్మి, సునీత, వీరమణీ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): జెన్కో యాజమాన్యం తీరు అమానవీయమని విద్యుత్తు ఆర్టిజెన్స్ ఉద్యోగులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికులను దారికి తెచ్చుకోవడానికి వారికి వైద్య సౌకర్యాలను నిలిపేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు హక్కుగా రావాల్సిన ‘హెల్త్ స్కీమ్ క్రెడిట్’ ఇవ్వకూడదంటూ ఆయా దవాఖానలకు జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్ రాజు ఆదేశాలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో వ్యతిరేకంగా పనిచేసిన కుమార్రాజు, ఆ అక్కసుతోనే ఆర్టిజన్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సమ్మెను సాకుగా చూపి కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టడం జెన్కో చరిత్రలో చీకటి రోజని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ఆర్టిజెన్లపై జెన్కో బెదిరింపులకు దిగింది. సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో విధుల్లో చేరకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. మరో వైపు ఆర్టిజెన్స్కు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను సైతం నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టిజన్స్ మండిపడుతున్నారు. మరోవైపు 13న హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు, ఆర్టిజన్ జేఏసీ నాయకులతో జాయింట్ మీటింగ్ నిర్వహించనున్నట్టు జాయింట్ లేబర్ కమిషనర్ సర్క్యులర్ జారీచేశారు. ఆ సమావేశంతో సమ్మె కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.