కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసింది సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈటల తల్లిలాంటి పార్టీని గుండెల మీద తన్నారన్నారు. ఈటల గులాబీ జెండాను మోసం చేశారన్నారు. హుజూరాబాద్‌లో ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. దత్తత గ్రామం సిరిసేడులోనూ ఏ ఒక్క పనిచేయలేదన్నారు. మంత్రిగా పనిచేయని ఈటల ఇప్పుడేం చేస్తారో చెప్పాలన్నారు.
రైతుబంధు కింద ఈటల రూ.10 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడేమో రైతుబంధు వద్దంటున్నడు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. అసహనంతో మాట్లాడుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏమైనా అభివృద్ధి చేశారా? రూ.10 లక్షల పని కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్ ధర.రూ.105కు చేరిందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని మంత్రి హరీశ్ అన్నారు. కాళేశ్వరం వచ్చాక నిండు ఎండల్లో కూడా నీరు పారిందన్నారు. కాళేశ్వరం తొలిఫలితం హుజూరాబాద్ ప్రజలకే దక్కిందన్నారు. రూ.10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలె అన్న మంత్రి ఈటలకు మేలు జరగాలో, నియోజకవర్గంలోని 2.29 లక్షల మందికి లాభం జరగాలో ఆలోచించాలని కోరారు. ఈ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక నేతలు పాల్గొన్నారు.