హైదరాబాద్, జనవరి 11 (నమస్తేతెలంగాణ): భువనగిరిలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి గర్హనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నేతలు తుంగ బాలు, ఫయాజ్‌తో కలిసి మాట్లాడారు. దాడికి బాధ్యులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతగాకే బీఆర్ఎస్ నాయకులు, కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కేటీఆర్, అల్లు అర్జున్‌పై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. రైతుభరోసా, రుణమాఫీ అమలులో విఫలమైన ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రోజుకో పొలిటికల్ డ్రామాను తెరపైకి తెస్తున్నదని తుంగ బాలు దుయ్యబట్టారు.