యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చేపట్టిన పాదయాత్ర అనంతరం విలేకరులతో మాట్లాడారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ అమలుచేయకుండా నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. 18 ఏండ్ల పైబడిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం బీఆర్ఎస్వీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విద్యార్థులు, యువతీయువకులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.