హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ కుట్రలను ఛేదించేందుకు బాధితులంతా ఏకంకావాలని, అప్పుడే తమ భూములు, ఇండ్లకు రక్షణ ఉంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూసీ పేరిట అన్నివర్గాల ప్రజల ఇండ్లను కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. మూసీ పరీవాహక ప్రాంతమైన బండ్లగూడ జాగీర్‌లోని హైదర్ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం జరిగిన మూసీ బాధితుల సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాద వ్, బక్క జడ్సన్‌తో కలిసి వారు పాల్గొన్నారు. మూసీ పరీవాహకంలోని విలువైన భూముల ను చెరబట్టి బడా కాంట్రాక్టర్లు, తన అనుయాయులకు కట్టబెట్టడమే సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా పెట్టుకొన్నారని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చి న నాటి నుంచి అభివృద్ధి కుంటుపడి ప్రజలం తా ఇబ్బందులు పడుతుంటే.. సీఎం మాత్రం ఇండ్లు కూల్చి, భూములను లాక్కొనే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. ఇండ్లను కూల్చి పెద్ద హోటళ్లు, భవనాలు నిర్మిస్తామని చెప్తున్నారని, మరి పేదలు, మధ్య తరగతి ప్రజలకు వ ర్తించిన బఫర్‌జోన్ వాటికి వర్తించదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 50 ప్రతినిధి బృందాలుగా స్వ యంగా బాధితులను కలిసి రేవంత్ సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్నట్టు తెలిపారు. బాధితులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
బాధిత ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఇండ్లను ఎలా కూలుస్తారు? అని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ సర్కార్‌ను ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ డ్రామా ఆడుతున్నదని మండిపడ్డారు. ముందు మూసీని మురుగు నుంచి కాపాడాలని, పరీవాహక ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని కోరారు. కానీ, సొంత ప్రయోజనాల కోసం పేదలు, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని బస్తీలన్నీ ఏకమై ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతామని హెచ్చరించారు. మూసీ బాధితులకు న్యాయం జరిగేంత వరకూ తాము ముందుండి కొట్లాడతామని స్పష్టంచేశారు. భూములు, ఇండ్లను ప్రభుత్వం లాక్కొనేందుకు ప్రయత్నించినా బస్తీ జేఏసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హెచ్చరించారు. బస్తీల నుంచి కూల్చివేతలు మొదలుపెడితే ఉద్యమం జరుగుతుందని దేవుండ్ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో డివైడ్ అండ రూల్ పాలసీ నడుస్తున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాకే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా ప్రజల ఇండ్లను కూల్చి ప్రాజెక్టులు కట్టలేదని తేల్చి చెప్పారు. కానీ తెలంగాణలో రేవంత్‌రెడ్డి బడాబాబులకు విలువైన భూములను కట్టబెట్టేందుకు పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చి బలిపశువులను చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదని, ఈ దశలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు కూడా అప్పు ఇవ్వదని చెప్పారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పెన్షనర్ల చావులకు కారణమవుతున్న ప్రభుత్వం.. లక్షన్నర కోట్లతో మూసీని సుందరీకరిస్తామనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మూసీ పరీవాహకంలోని కొంతమంది బడాబాబులను బెదిరించేందుకు పేదల ఇండ్లు కూలుస్తున్నారని ఆరోపించారు. చెరువుల్లో ఉన్న విల్లాలు, కన్వెన్షన్ హాళ్లు, రిసార్ట్‌లను టచ్చేసే ధైర్యం లేక పేదల ఇండ్లను కూల్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. శని, ఆదివారాల్లోనే కాకుండా పూర్తిస్థాయిలో పోరాటాలు చేసి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరంలో విజృంభిస్తున్న దోమలను నిర్మూలించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు కానీ, రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎలా చేపడుతారు? అని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు వెనుక పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూలగొట్టే కుట్ర ఉన్నందునే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతున్నదని తెలిపారు. రెండేండ్ల వరకు ఐక్య పోరాటాలతో ఇండ్లను కాంగ్రెస్ సర్కార్ నుంచి కాపాడుకొంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరీవాహక ప్రాంత ప్రజల ఇండ్లకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పైసా పైస పోగేసి కొన్న ఇండ్లు, భూములకు జీరో వాల్యూ చేస్తామంటే ఎవరూ భయపడి పారిపోరని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే డీపీఆర్ చూపి మూసీ బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ‘ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ ప్రాజెక్టు నిర్మించండి.. మేమే వచ్చి కొబ్బరికాయ కొట్టి మద్దతిస్తాం’ అని సూచించారు.