హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు వల్ల కృష్ణా నదిలో ఏర్పడే మిగులు జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు కేటాయించాలని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ దిశగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, ట్రిబ్యునల్‌లో గట్టిగా వాదనలు వినిపించాలని సోమవారం ఓ ప్రకటనలో కోరారు.
పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిందని గుర్తుచేస్తూ.. ఆ జలాల వినియోగానికి సైతం ఏపీ అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రినీవా, గాలేరు నగరి సుజల స్రవంతి, ముచ్చుమర్రి, మల్యాల తదితర లిఫ్ట్‌లను ఏపీ అక్రమంగా నిర్మించడంతోపాటు అంతకంతకూ విస్తరిస్తూ ఏటా కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో కృష్ణానది పక్కనే ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు నదీ జలాలు దక్కడం లేదని తెలిపారు.