మలి ఉద్యమంలో చైతన్యం కలిగించాయి: హరీశ్‌రావు
రవీంద్రభారతి, జూలై 13: మల్లావఝల సదాశివుడు సాహిత్యం పాటలు తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి-చేతన సాహితీ ఆధ్వర్వంలో మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదాశివుడు పురస్కారాన్ని మోహన్‌రుషి, పసునూరి శ్రీధర్‌బాబుకు బహూకరించారు.
అనంతరం మాట్లాడుతూ.. సదాశివుడు పాట ఎంతో గొప్పదని, తెలంగాణ మలిదశ ఉద్యమానికి సదాశివుడి పాట చైతన్యం తీసుకొచ్చిందని తెలిపారు. ఆయన ఆశయాన్ని కేసీఆర్ కొనసాగించారని వెల్లడించారు. ‘కష్టాల్లోంచి, రైతుల వెతల్లోంచి పాటలు వచ్చాయి. నీళ్ల కోసం పాటలు వచ్చాయి. తలాపున పారుతుంది గోదారి.. చేను చెలక ఏడారి పాట తెలంగాణ నీళ్ల గోసను చూపెట్టింది. తెలంగాణ వచ్చాక ఎర్రటి ఎండలోనూ మత్తళ్లు దూకిన చెరువులు కనిపించాయి.
సమైక్య పాలనలో రైతుల ఆత్మహత్యలపై సదాశివుడు పాడిన పాటలను విని కేసీఆర్ ఎంతో ఆవేదన చెందారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి తెలంగాణ రైతాంగం కండ్లలో ఆనందాన్ని చూశారు’ అని గుర్తుచేశారు. ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ర్టాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పని చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వర్షాభావ పరిస్థితులతో నీరు లేక తిరిగి పాత రోజులు వచ్చాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డలో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు ఆ నీటిని విడుదల చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harishrao1
నిరుద్యోగులపై లాఠిచార్జి దురదృష్టకరమని అన్నారు. ‘రోజూ పేపర్లు చూడగానే రైతులు ఆత్మహత్యలు కనిపిస్తున్నయ్. కరెంట్ కోతలు మొదలైనయ్. కళాకారులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని చెప్తున్నరు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతాం. కవులు, కళాకారులు మళ్లీ తమ కలాలకు పని కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి’ అని కోరారు. గత ప్రభుత్వంపై నిందలు వేయటం కాదు, రైతుల కన్నీళ్లు తుడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు.
ప్రముఖ కవి, సాహిత్య విమర్శకుడు, సిటీ కాలేజీలో తెలుగు శాఖ అధ్యక్షుడు కోయి కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల గుండెల్లో నిలిచిన వ్యక్తి సదాశివుడు అని కొనియాడారు. దళిత, బహుజన చైతన్యాన్ని పాటలో ఎలుగెత్తి చాటిచెప్పారని వెల్లడించారు. చాలామంది మంత్రులు ప్రొటోకాల్ ఎంజాయ్ చేస్తుంటారని, కానీ, కార్యకర్తలా పనిచేసే వ్యక్తి హరీశ్‌రావు అని తెలిపారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సదాశివుడు రాసిన పాటలు దళితుల్లో ఒకడిగా ఉండి రాసినవని అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ దేవీప్రసాదరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, మల్లావఝల సదాశివుడు కుమారుడు విజయానంద్, వారి కుటుంబ సభ్యులు, తెలంగాణ వికాస సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.