హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తం’ అని ప్రకటించిన రేవంత్ సర్కారు.. హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్‌రోడ్డులో గత సీఎం ఏర్పాటు చేయించిన 125 అడుగుల భారీ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విగ్రహం గేట్లకు తాళాలు వేసి కనీసం చెత్తను కూడా తీయకుండా నిర్లక్ష్యం వహించింది. అభిమానులు సైతం ఆ మహనీయుడికి నివాళులు అర్పించకుండా కక్షగట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని ఏడాదిన్నరగా నిలదీస్తున్న బీఆర్ఎస్, అంబేద్కర్ జయంతి రోజున కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పించకుండా చేయడంపై తీవ్రంగా మండిపడింది. సోమవారం అంబేద్కర్ జయంతి ఉన్న సందర్భంగా ‘అంబేద్కర్ విగ్రహం గేట్లను తెరుస్తారా? లేదా? ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే అంబేద్కర్ వాదులమంతా కలిసి గేట్లు తెరుస్తం.. అక్కడ చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేస్తం’ అని బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడె రాజీవ్‌సాగర్, మన్నె గోవర్ధన్, ఇంతియాజ్ అహ్మద్, గోసుల శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ భారీ విగ్రహంపై రేవంత్ సర్కారు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
అంబేద్కర్‌ను అంటరానివాడిని చేస్తారా?
ఎర్రోళ్ల మాట్లాడుతూ నిరుడు ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ ఉన్నదన్న సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించలేదని విమర్శించారు. 16 నెలలుగా అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ఎందుకు తీయడం లేదని నిలదీశారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి 1,024 గురుకులాలు ఏర్పాటుచేసి వారిపై నిబద్ధత చాటుకున్నారని తెలిపారు. అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలిస్తే, ఆయన విగ్రహాన్ని ప్రజలు చూడకుండా రేవంత్ సర్కారు ఆయనను అంటరానివాడిగా చేస్తున్నదని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అని, ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కులానికి అంటగడుతున్నదని విమర్శించారు. కేసీఆర్‌పై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలె గాని, అంబేద్కర్‌ను అవమానించవద్దని హితవు పలికారు. సచివాలయానికి కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం వల్లే సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి పాలన చేయడం లేదని, మరి అదే కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ నుంచి ఎలా పాలన సాగిస్తున్నారని నిలదీశారు. జిల్లాల్లో కేసీఆర్ కట్టించిన కలెక్టరేట్ల నుంచి పాలన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం గే ట్లు తెరిచే విషయంలో కాంగ్రెస్ సర్కారులోని 26 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్యెల్యేలు సీఎంను నిలదీయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
స్పందించిన సర్కారు.. పరిసరాలు శుభ్రం
బీఆర్ఎస్ నేతల హెచ్చరికతో స్పందించిన సర్కారు సాయంత్రానికి గేట్లు తెరిపించి విగ్రహం పరిసరాలను శుభ్రం చేయించింది. గేట్ ముందు ఉన్న నీటిని తొలిగించింది. అధికారులు పారిశుధ్య కార్మికులతో చెత్తను తొలగింపజేశారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.