e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News గ్యాస్‌ ధర పెంచబోమని ఈటల చెప్పగలరా?

గ్యాస్‌ ధర పెంచబోమని ఈటల చెప్పగలరా?

  • ఎన్నికల తర్వాత గ్యాస్‌ రూ.200 పెరుగుతది
  • బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రం
  • ఈటల గెలిస్తే ఆయనకే లాభం.. ప్రజలకు కాదు
  • గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండి.. మీకు సేవ చేస్తాం
  • సిరిసేడు ధూంధాంలో మంత్రి హరీశ్‌రావు భరోసా

దళితబంధు రాదనే బెంగ వద్దు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలు నమ్మొద్దు. దళితులు అడగకుండానే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆయన సంకల్పం. గత ప్రభుత్వాల హయాంలో చెప్పులరిగేలా తిరిగినా దళితులకు రుణాలు ఇవ్వలేదు. మాయావతి కూడా ఇలాంటి పథకం అమలు చేయలేకపోయారు. దళితబంధు గ్రౌండింగ్‌ చేయకపోతే నా పేరే మార్చుకుంటా.

-ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

- Advertisement -

ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్‌/వీణవంక, అక్టోబర్‌ 25 : ‘హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత వచ్చేనెల ఒకటినో, రెండో తారీఖునో గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అంటే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1200 అయితది. ఏడాదిలో రూ.2 వేలు అయితది.. మరీ గ్యాస్‌ ధరలు పెంచబోమని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు, పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రజలకు చెప్పగలరా?, అలా చెప్పి ఓట్లు అడుగగలరా’? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో నిర్వహించిన ధూంధాంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఝూటా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రమవుతదని హెచ్చరించారు. ప్రజలపై ప్రేమ ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే ఆయనకే లాభమని, గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే, ఇక్కడి ప్రజలకు సేవ చేస్తామని హామీ ఇచ్చారు.

గెల్లు గెలిస్తే మెడికల్‌ కాలేజీ, అధునాతన లైబ్రరీ
‘సీతారామచంద్ర స్వామి సాక్షిగా చెప్తున్న.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకుందాం.. చల్లూరు మండలాన్ని సాధించుకుందాం’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం వీణవంక మండలం చల్లూరు, వీణవంక గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ రోడ్‌షోలో హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీకి ఓటు వేయడం అంటే మన వేలితో మనకన్ను పొడుచుకున్నట్టేనని అన్నారు. మంత్రిగా ఉండి ఈటల మెడికల్‌ కాలేజీ హైదరాబాద్‌లో కట్టాడే గానీ, వీణవంకలో ఒక్క డిగ్రీ కాలేజీ కట్టలేదని గుర్తుచేశారు. కనీసం ఒక్క స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తీసుకొచ్చాడా? అని ప్రశ్నించారు. యువకుల కష్టాలు యువకులకే తెలుస్తాయని, గెల్లును గెలిపించాలని కోరారు. ఢిల్లీ వాళ్లు కావాలా? గల్లీలో ఉండి పనిచేసే వాళ్లు కావాలా? నిర్ణయించుకోవాలని సూచించారు. ఈటల రాజేందర్‌ పేదల భూములతోపాటు దేవుడి భూములనూ వదల్లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఆరోపించారు. భూములను కాపాడాలని చూసిన సీఎం కేసీఆర్‌పై ఈటల కుట్రలు చేశారని మండిపడ్డారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, తనను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కిషన్‌రెడ్డే పిరికిపంద: గెల్లు శ్రీనివాస్‌
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తనను పిరికిపంద అని అంటున్నారని, ఎవరు పిరికిపందనో ప్రజలందరికీ తెలుసని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఈటల పులిబిడ్డ ఎట్లా అవుతడో కిషన్‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. బీజేపీ చెప్పే అబద్ధపు మాటలు ప్రజలు నమ్మవద్దని, ఏ పార్టీతో మనకు భవిష్యత్తు ఉంటదో ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని, కూల్చాలని ఈటల కుట్రలు చేశారని మండిపడ్డారు. పేదింటి బిడ్డనైనా తనను ఓడించడానికి కేంద్ర మంత్రులు రావడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

ఇతర రాష్ర్టాల్లో అమలు చేయట్లేదెందుకు?
కేసీఆర్‌ కిట్‌లో కేంద్రం రూ.5 వేలు ఇస్తుందని బీజేపోళ్లు అంటున్నరు. మరి మీ పాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేరు?. గొల్ల, కురుమలకు గొర్రెలే ఇస్తారా? అని అడుగుతున్నరు. యాదవ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు సీఎం కేసీఆర్‌కు ఏకంగా ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి, రాజ్యాధికారమే చేతిలో పెట్టారు.

  • ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

బడుగుల శాశ్వత శత్రువు బీజేపీ
బడుగు బలహీన వర్గాలకు శాశ్వత శత్రువు బీజేపీ. దశాబ్దాలపాటు దళితులను కనీసం మనుషులుగా చూడలేదు. దళితులకు ఆర్థిక చేయుత అందించేందుకు కేసీఆర్‌ కంకణం కట్టుకొన్నారు. కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ దళితులను బానిసలుగా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దళితుల గురించి మాట్లాడే నైతిక హకు లేదు. దళితులను ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేశారే తప్ప ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదు. దేశానికి అన్నం పెట్టే రైతుకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన పార్టీ బీజేపీ కాదా?. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులు నిరసన తెలుపుతుంటే వారిపై కార్లు ఎకించి చంపించింది బీజేపీ కాదా?. దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తా అంటే ఎలక్షన్‌ కమిషన్‌కు ఉత్తరం రాసి దాన్ని అడ్డుకుంది బీజేపీ వాళ్లు కాదా?. దళిత బహుజన వర్గాలకు ఈటల ఏం చేశాడని ఆయనకు ఓటు వేయాలి. గెల్లును గెలిపిస్తే హుజూరాబాద్‌కు మంచి రోజులు వస్తాయి.

  • వంగపల్లి శ్రీనివాస్‌, టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

రైతులు, దళితులపై బీజేపీకి ప్రేమ లేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులు, రైతులపై ప్రేమ లేదు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. రిజర్వేషన్లు ఆపే కుట్ర చేస్తూ దళితులపై విషం కక్కుతున్నది. 23 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నది. యూపీలో 6వేల మంది దళిత యువకులను చంపివేసింది. 4,200 మంది మహిళలపై అత్యాచారాలు చేసి చంపింది. ఆ విషయాలపై మోదీ, అమిత్‌షాలు ఎందుకు మాట్లాడట్లేదు. అలాంటి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటలను చిత్తుగా ఓడించాలి. గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా నిలవాలి.

  • ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం

సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి, ఓటర్లను చైతన్యపర్చాలి. సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించిన పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఆశీర్వదించాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను పెంచడంతో సామాన్యులపై మోయలేని భారం పడింది. బీజేపీకి హుజూరాబాద్‌ ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పాలి.

  • ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement