హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇటువంటి అనుమానాలే కలుగుతున్నాయి. బీఆర్ఎస్కి చెందిన మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గత నవంబర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు పేరాల శేఖర్‌రావు ఫిర్యాదుల మేరకు గంగుల కుటుంబసభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. చైనాకు గ్రానైట్ ఎగుమతి విషయంలో అక్రమాలు జరిగాయని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో రూ.3 కోట్లు చెల్లించి మిగిలిన డబ్బు హవాలా రూపంలో చేతులు మారిందంటూ మీడియాకు లీకులు ఇచ్చింది. దీనిపైనే మళ్లీ తాజాగా నోటీసులు ఇచ్చింది.
కరీంనగర్ జిల్లాలో ఎంపీ బండి సంజయ్‌కి రాజకీయంగా అడ్డుగా ఉన్న గంగుల కమలాకర్ అడ్డు తొలగించడానికే బీజేపీ ఈవిధమైన వ్యూహం పన్నుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడుతున్నది. ఇదంతా బీజేపీ అధినాయకత్వం కనుసన్నల్లోనే జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.