హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, ‘బహుజన రాష్ట్ర సమితి’ అని పేదలు అంటున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలని పార్టీ తరఫున కోరుకుంటున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని దృఢ నిశ్చయంతో పనిచేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు సరికాదని హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలకు మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ రోజు వరకు ఎందుకు అమలు చేయలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల బీసీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి తాము చేసిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో జీవో ఇచ్చిన తర్వాత న్యాయ చిక్కులు వచ్చాయని కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలంగాణ బిడ్డ ఐఏఎస్ అధికారి రాజేందర్‌ను ప్రభుత్వం పిలిచిందని, వాళ్లు కూడా బీహార్‌లో కోర్టు కొట్టేసిందని చెప్పినట్టు గంగుల వివరించారు. న్యాయవ్యవస్థ, జీఏడీతో తొలుత సమీక్ష చేసి ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించి ఉంటే రిజర్వేషన్ల విషయంలో ఈ సమస్య తలెత్తేది కాదని వివరించారు.
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లు పాసై, 42 శాతం రిజర్వేషన్లు అమలైతే మొదట సంతోషించేది తానే అని గంగుల తెలిపారు. పార్టీ పక్షాన ఈ బిల్లు పాసై ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా 42 శాతంతో మున్సిపల్, పంచాయతీల్లో మేమెంతో మాకంత వాటాగా రిజర్వేషన్లు అమలైతే స్వాగతిస్తామని చెప్పారు. మార్చిలో బిల్లు పెట్టిన సందర్భంగా సైతం బీఆర్ఎస్ పక్షాన స్వాగతించినట్టు వెల్లడించారు. నాడు ప్రభుత్వం సూచనలడిగితే ఇచ్చామని గుర్తుచేశారు. శాస్త్రీయంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడితే విజయవంతమైన రాష్ట్రం తమిళనాడు అని, అశాస్త్రీయంగా చేయడంతో విఫలమైన రాష్ర్టాలు బీహార్, మధ్యప్రదేశ్, యూపీ అని స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను అశాస్త్రీయంగా చేయడంతో కోర్టు ఈ రాష్ర్టాలకు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. అందుకే వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేలా శాస్త్రీయంగా బీసీ బిల్లు విషయంలో ముందుకెళ్లాలని గతంలో సూచించినట్టు స్పష్టంచేశారు. తాము చెప్పిన విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఉంటే చిక్కులు రాకుండా ఉండేవని వివరించారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లు, జీవో తెస్తున్నామని సీఎం చెప్పారని, మరి 22 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారని, అప్పుడే జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఎందుకు జీవో ఇవ్వకుండా సుమారు 6 కమిటీలు వేసిందని నిలదీశారు.
మార్చి 24న జీవో 26ను ప్రభుత్వం తెచ్చిందని, రిజర్వేషన్లు పాస్ చేశాం.. కులగణన సర్వే చేస్తామని చెప్పిందని గంగుల గుర్తుచేశారు. ఈ జీవోను బీసీ కమిషన్ ద్వారా తెచ్చారని, దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైందని మండిపడ్డారు. తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి జీవో 18ని తెచ్చారని వెల్లడించారు. దీనికి ఉత్తమ్ ఆధ్యక్షతన కమిటీ వేశారని తెలిపారు. బీహార్‌లో ఇలాగే జరిగిందని అందుకే తమ సూచనలు పరిగణలోకి తీసుకొని ఉండాల్సిందని చెప్పారు. పొన్నం కల్పించుకోగా మంత్రికి వాస్తవాలు తెలియవని గంగుల దెప్పిపొడిచారు.
బూసాని వెంకటేశ్వర్లు కమిటీని 46 జీవోతో వేశారని, కోర్టు 13వ పేరా చదవాలని ప్రభుత్వానికి సూచించినట్టు గంగుల స్పష్టంచేశారు. 13వ పేరాలోని ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్-1952’ ప్రకారం డెడికేషన్ వేయాలని సూచించిందని వెల్లడించారు. కానీ బూసాని వెంకటేశ్వర్లు కమిటీని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేయడంతో ఆ రిపోర్టు చెల్లదని స్పష్టంచేశారు. ఇటీవల బీసీ బిల్లు చేయగా అది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నదని, ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా న్యాయ సమీక్షకు పంపుతారని, క్లియరెన్స్ తీసుకుంటారని చెప్పారు. తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ముందుకెళ్తారని వివరించారు. చిన్న లోపం ఉన్న బిల్లును ఆమోదం తెలిపే వీలుండదని గుర్తుచేశారు. తమిళనాడులో 31 (సీ) కింద తీసుకున్న తర్వాత మళ్లీ పీవీ నరసింహరావు, జయలలిత వెళ్లి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని అప్పుడే దానికి చట్టబద్ధత వస్తుందని చెప్పారని స్పష్టంచేశారు. దీంతో 1994లో పీవీ నర్సింహరావు 9వ షెడ్యూల్లో పెట్టారని వెల్లడించారు. ప్రభుత్వం బిల్లు పాస్ చేసి తర్వాత జీవో ఇస్తుందని, ఆ జీవోకు రక్షణ లేకుంటే ఎవరు కోర్టుకెళ్లినా నిలవదని చెప్పారు.
42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నట్టు సీఎం చెప్తున్నారని, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్న రిజర్వేషన్లను తప్పనిసరిగా ఇవ్వాలని గంగుల డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీలకు బిల్లు, ఆమోదం, గవర్నర్, రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదని చెప్పారు. 42 శాతం మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామన్నారని, 18 మందిలో బీసీలకు దక్కాల్సిన వాటాగా మంత్రి పదవులు ఇవ్వాల్సిందే డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో చట్టం చేస్తేనే బిల్లుకు రక్షణ వస్తుందని గంగుల వెల్లడించారు. జయలలిత నాడు చేసినట్టు చేస్తేనే దీనికి చట్టబద్ధత వస్తుందని చెప్పారు. బీహార్, మధ్యప్రదేశ్‌లో మన రాష్ట్రంలో చేసినట్టు చేస్తే కోర్టు కొట్టేసినట్టు తెలిపారు. ఈ బిల్లుకు శాస్త్రీయత దక్కాలంటే 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి క్యాబినెట్లో పెట్టి పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తేనే 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే చట్టాల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీషేమింగ్‌కు పాల్పడ్డారు. ‘ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువగా ఉంటుందా’ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఆదివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ పక్షాన గంగుల కమలాకర్ మాట్లాడారు. మధ్యలో కల్పించుకున్న పొన్నం ప్రభాకర్… ‘బీసీ రిజర్వేషన్లపై నాకు అవగాహన లేదంటారా? గంగుల కంటే ఎక్కువే చదువుకున్నా.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా.. నాకు ఎక్కువ తెల్వదు అనుకుంటే పొరపాటు. ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కవ ఉంటది అనుకుంటే పొరపాటు’ అని విమర్శించారు. దీంతో గంగుల కమలాకర్ స్పందిస్తూ.. ‘నేను కూడా బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది’ అని అన్నారు. సభలో సమాధానం చెప్పాల్సిన మంత్రి.. ప్రతిపక్ష సభ్యుడి పట్ల బాడీషేమింగ్‌కు పాల్పడటమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.