హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వాడిన భాషకు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానందతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వాడిన భాషను రాష్ట్ర ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ పాలసీలపై మాత్రమే మాట్లాడేవాళ్లని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి అసహనంతోనే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్న సభలో ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు అవమానకరంగా భావిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి భాష అభ్యంతరకరంగా ఉందని, సీఎంగా మాట్లాడాల్సిన భాషేనా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులను ఎలా తిట్టాలనే సీఎం గత 15నెలలుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ మానసికస్థితి సరిగా లేదని, ఆయనను కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలన చేతకాకపోవడంతోనే గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. కాళేశ్వరం అనే పవిత్రమైన పేరును సీఎం కూలేశ్వరం అనడం ఏంటని ప్రశ్నించారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ‘చెల్లని రుపాయికి గీతలు ఎక్కువ.. చిల్లర రేవంత్‌రెడ్డికి ఎకసెక్కాలు ఎక్కువ’ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. శిశుపాలుడికి శాస్తి జరిగినట్టే రౌడీ మాటలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ‘పరిపాలన చేతకాదు.. వాగ్ధానాలు అమలు చేయరాదు.. పనికిరాని బూతులకే రేవంత్‌రెడ్డి పరిమితమయ్యారని విమర్శించారు. తన అహంకారపు ధోరణితో నీచ రాజకీయాల మడుగులో మునిగి, తన అసలు స్థాయిని మరోసారి చాటుకున్నారని విమర్శించారు. తండ్రి వయసున్న కేసీఆర్‌ను అవహేళన చేయడం, శాపనార్థాలు పెట్టడం.. పరోక్షంగా బెదిరింపులకు దిగడం రేవంత్‌లోని హీన మనస్తత్వానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు. స్వీయ నియంత్రణ లేని కోతి గద్దెమీద కూర్చున్నా.. సంస్కారం లేని మూర్ఖుడు సీఎం కుర్చీలో కూర్చున్నా.. ఎలా ఉంటుందో రేవంత్ నిత్యం నిరూపిస్తున్నాడని దుయ్యబట్టారు.