సంగారెడ్డి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హిల్ట్ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని పరిశ్రమలను అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి తదితరులతో కలిసి సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడుతున్నారని, తెలంగాణ భూములు, ఆస్తులను అప్పనంగా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పాశమైలారంలో ఎకరం భూమి ధర కోట్లలో ఉంటే, కేవలం రూ.27 లక్షలు చెల్లిస్తే మల్టీజోన్‌లో మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. పాశమైలారం పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం నాడు సేకరించిన భూములను తిరిగి పాశమైలారం ప్రాంత రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేర్కొన్నట్టు ఎకరాకు రూ.27 లక్షలు చొప్పున చెల్లించి తమ భూములను తిరిగి కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఆదాయం కావాలని అనుకుంటే పాశమైలారం, పటాన్చెరు ప్రాంతంలో హిల్ట్ పేర్కొన్న భూములను ఓపెన్ ఆక్షన్‌లో వేలం వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ప్రాంత భూములను ప్రజా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ఈ మూడు డిమాండ్లు పక్కనబెట్టి రెగ్యులరైజ్ చేస్తే ఒప్పుకోబోమని స్పష్టంచేశారు. పాశమైలారం,,పటాన్చెరు పారిశామ్రికవాడల్లోని భూములను రెగ్యులరైజ్ చేస్తే, 50వేల మందికిపైగా కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఢిల్లీ అధిష్ఠానానికి మూటలు పంపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. రేవంత్ సర్కార్ భూ కుంభకోణాలకు పాల్పడుతున్నది తప్ప తెలంగాణ ప్రజల కోసం పనిచేయడంలేదని దుయ్యబట్టారు. మొదట మూసీ భూములపై కన్నేసిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఆ తర్వాత ఫార్మాసిటీని రద్దు చేసి అక్కడ ఫ్యూచర్‌సిటీ పేరుతో భూ దందాకు తెరలేపిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక అనకొండలా హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశామ్రిక భూములను కబళించేందుకు హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మండిపడ్డారు. పటాన్చెరు, పాశమైలారం ప్రాంతంలోని ప్రజలు తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడితే ఉపాధి లభిస్తుందనే భూములు ఇచ్చారని, ఏండ్లపాటు కాలుష్యం కష్టాలను భరించారని చెప్పారు. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు కాలుష్యం బారినపడితే కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా పారిశ్రామికవాడల్లోని ప్రజలకు తాగునీరు అందజేశారని వివరించారు. తెలంగాణ భూములు తెలంగాణ ప్రజలకు మాత్రమే దక్కాలని లేదంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివకుమార్, శ్రీకాంత్‌గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, కొలను బాల్‌రెడ్డి, సోమిరెడ్డి, మాణిక్‌యాదవ్, రాములుగౌడ్, మేరాజ్‌ఖాన్, కృష్ణాయాదవ్, చందు ముదిరాజ్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.