న్యూఢిల్లీ: భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా(Shtooter Jaspal Rana) కన్నుమూశారు. ఆయన వయసు 49 ఏళ్లు. ప్రఖ్యాత కోచ్‌గా ఆయనకు పేరు ఉన్నది. భారత షూటర్ మనూ బాకర్‌కు ఆయన శిక్షణ ఇచ్చారు. ఆసియా క్రీడల్లో ఆయన గతంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. భారతీయ పిస్తోల్ షూటర్లకు కోచ్‌గా కొనసాగుతున్న జస్పాల్ రాణా అనూహ్య రీతిలో తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి ఆయన ప్రాణాలు విడిచినట్లు సమీప మిత్రులు, బంధువులు తెలిపారు. జర్మనీలోని మునిచ్ ఇటీవల జరిగిన షూటింగ్ ఈవెంట్‌కు జస్పాల్ రాణా హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఆ ఈవెంట్లో భారత షూటర్లు రాణించారు. రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.. జర్మనీ నుంచి వస్తున్న సమయంలో జస్పాల్ రాణా విమానంలోనే తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. అయితే ఢిల్లీలో దిగగానే ఆయన్ను నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు. కానీ షూటర్ రాణా ఆ చికిత్స నుంచి కోలుకోలేకపోయారు. జస్పాల్ రాణా మృతి భారత షూటర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మేటి షూటర్‌గా రాణించడంతో పాటు ఉత్తమ కోచ్‌గా ఆయన అనేక ఆటగాళ్లకు మెంటర్‌గా చేశారు.
జస్పాల్ రాణా తన కెరీర్లో అత్యుత్తమ షూటర్‌గా నిలిచారు. ఆసియా క్రీడల్లో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. ఎన్నో అంతర్జాతీయ టోర్నీల్లోనూ సక్సెస్ అయ్యారు. అథ్లెట్‌గా మేటి ప్రదర్శిన ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత కోచ్‌గా కూడా యువతను ఎంతో ప్రోత్సహించారు. 2012లో ఆయన జాతీయ జూనియర్ పిస్తోల్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యారు. భారత మేటి షూటర్లు అయిన సౌరభ్ చౌదరీ, అనిశ్ భన్వాలా, చింకి యాదవ్‌లకు ఆయనే శిక్షణ ఇచ్చారు.
జూనియర్ షూటర్లు మాత్రమే కాదు, మేటి షూటర్ మనూ భాకర్‌ను కూడా ఆయనే తీర్చిదిద్దారు. 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్ రెండు కాంస్య పతకాలను గెలిచిన విషయం తెలిసిందే. జస్పాల్ రాణా అందించిన కోచింగ్ వల్లే మనూ భాకర్ ఆ పతకాలను గెలుచుకోగలిగింది. తీవ్రమైన వత్తిడిలో ఉత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలన్న మెళుకువలను ఆయన నేర్పారు. ఇక 2025 ఫిబ్రవరిలో ఎన్ఆర్ఏఐ రాణాను హై పర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించింది. 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌కు స్పెషలిస్టు కోచ్‌గా చేశారు. ప్రపంచ స్థాయి ఉత్తమ షూటర్లను తీర్చిదిద్దే క్రమంలో ఆయన ప్రాణాలను అర్పించారు.
2020లో షూటర్ జస్పాల్ రాణాకు .. ద్రోణాచార్య అవార్డును ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. తొలుత చాంపియన్‌గా, ఆ తర్వాత మేటి కోచ్‌గా జస్పాల్ రాణా ఓ చరగని ముద్ర వేసుకున్నారు. భారతీయ షూటింగ్ క్రీడా రంగ స్వరూన్నే ఆయన మార్చేశారు. ఎంతో మంది అథ్లెట్లకు ఆయన ప్రేరణగా నిలిచారు. జస్పాల్ రాణా లాంటి మేటి కోచ్‌ను కోల్పోవడం భారత క్రీడారంగానికి తీరని లోటే.
VIDEO | Delhi: On Indian shooting legend Jaspal Rana’s demise, TMC MP Kirti Azad says, “Jaspal was the pride of our nation. He earned so many medals. I personally knew him, and he used to call me ‘Bhaiya’ (brother). He was a truly wonderful boy with a very kind nature. Even after… pic.twitter.com/MAdcRVC1Bw
— Press Trust of India (@PTI_News) June 12, 2026