న్యూయార్క్: ఇరాన్‌పై దాడుల్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) గురువారం ప్రకటించారు. అయితే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై రెండు దేశాల మధ్య ఎంవోయూ జరగనున్నట్లు చెప్పారు. అయితే ఈ వారాంతంలో యూరోప్‌లో ఆ అగ్రిమెంట్‌పై సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎటువంటి తుది నిర్ణయం జరగలేదని ఇరాన్ పేర్కొన్నది. ఒప్పందానికి చెందిన డాక్యుమెంట్లపై తుది సంతకాలు మరికొన్ని రోజుల్లో జరగనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో డీల్ చివరి దశలో ఉందని, లేదంటే భారీ దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఖతార్ మీడియేటర్లు, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు సాగుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే వారి మధ్య డీల్ కుదిరినట్లు తెలిసిందన్నారు. ఇరానీ నేతలతో జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని, దీంతో ప్రతిపాదిత దాడులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో ప్రకటించారు. చర్చల్లో అన్ని అంశాలపై అంగీకారం కుదిరిందని, అన్ని పార్టీలు అప్రూవ్ చేశాయని, అమెరికా, ఇజ్రాయల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్థాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్టుతో పాటు ఇతర దేశాలు కూడా ఆ ఒప్పందాలకు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఇరానీ షిప్పింగ్‌పై మాత్రం పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పీస్ డీల్‌పై సంతకాల గురించి టైం, స్థలాన్ని త్వరలో ప్రకటిస్తామని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ చేసిన డీల్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రియాక్ట్ అయ్యింది. తుది డీల్ ఫైనలైజ్ అయిన అంశం తమకు తెలియదని ఇజ్రాయెల్ చెప్పింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాగేహి మాట్లాడుతూ.. శాంతి ఒప్పందంపై సంతకాలకు సంబంధించిన అంశం తమకు తెలియదన్నారు. డీల్‌పై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. చర్చలకు చెందిన అంశాల్లో చాలా వరకు డీల్ ఓకే చేసుకున్నా.. అమెరికా మాత్రం ప్రతి చర్చల్లోనూ తన అభిప్రాయాలను మార్చుకుంటోందని ఇస్మాయిల్ బాగేహి ఆరోపించారు. యూరోప్‌లో జరిగే సంతకాల కార్యక్రమానికి జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ హాజరుకానున్నారు.