ఎల్లారెడ్డి, జూలై 21: అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని కామారెడ్డి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పర్మళ్ళ గ్రామస్తులు మొక్కలు నాటగా, గ్రామానికి సమీపంలోని పలు తండాలకు చెందిన గిరిజనులు వాటిని తొలగించారని సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు.. కలెక్టర్, డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎఫ్‌వో మంగళవారం ఉదయం స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సుమారు 50 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించినట్లుగా గుర్తించి, ఎల్లారెడ్డి రేంజ్ అధికారి, సిబ్బందిని అక్కడికి రావాలని ఫోన్లో ఆదేశించారు. వెంటనే అక్కడికి వారు చేరుకోగా ..మొక్కలను తొలగించడం నేరమని, ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి సాగు చేస్తుంటే సమాచారం ఎందుకు ఇవ్వలేదన్నారు. ఒక దశలో విధులు నిర్వహించడానికి మీరు అనర్హులంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అటవీ ప్రాంతంలోని బీట్ నంబర్ 730లో సుమారు 50 ఎకరాలకుపైగా ఆక్రమణలో ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఆక్రమణలతోపాటు స్థానిక సిబ్బంది పనితీరుపై డీఎఫ్‌వో ఫోన్లో పీసీసీఎఫ్‌కు వివరించినట్లు తెలిసింది. ఇద్దరిని అరెస్ట్ చేసి
అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో పరిశీలిస్తున్న సమయంలో గిరిజనులు అక్కడికి చేరుకున్నారు. మొక్కలను తామే తొలగించామని, అటవీభూమిని సాగుచేస్తున్నామని చెప్పడంతో సర్పంచ్‌కు గిరిజనులకు మధ్య గొడవ చోటుచేసుకున్నది. ఆగ్రహించిన డీఎఫ్‌వో గొడవకు దిగిన వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. దీంతో ఇద్దరిని అటవీ శాఖ అధికారులు ఎల్లారెడ్డి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. పర్మళ్ల అటవీ ప్రాంతంలోని మొక్కల తొలగింపు, అటవీ ప్రాంతం ఆక్రమణల విషయమై విచారణ చేపడుతున్నట్లు ఎఫ్ఆర్వో రమేశ్ తెలిపారు.
అటవీ ప్రాంతంలోని బీట్ నంబర్ 730లో అటవీ భూములు ఆక్రమణకు గురికావడం, ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ధ్వంసం చేయడం ఘటనపై ఆగ్రహించిన డీఎఫ్‌వో నీరజ్‌కుమార్.. బీట్ ఆఫీసర్ శ్యాంసుందర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్కు సిఫారసు చేశారు.