నాట్యం శివస్వరూపం. అందులోని ప్రతి అడుగులోనూ నటరాజ స్వామి కొలువై ఉంటాడు. అయితే తాను నేర్చిన కూచిపూడిలో శివుడు ఏ రూపంలో కొలువయ్యాడు, దాని వెనుక సైన్స్ కోణమేంటి అని ఆలోచించింది హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి, నాట్యకారిణి డా॥ ప్రియాంక భర్డే. అదే అంశం మీద పీహెచ్డీ కూడా చేసి, అర్ధనారీశ్వరుడి గురించి రూపకాన్ని తీర్చిదిద్దింది. తాను స్థాపించిన హిరణ్మయి నృత్యాలయ ద్వారా వేయి మందికి పైగా విద్యార్థులకు నృత్య పాఠాలు నేర్పింది. ఇటీవల రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి విశ్వవేదిక మీద గంపెడు చప్పట్లు పోగుచేసుకొచ్చిన ఆమెతో ‘జిందగీ’ ముచ్చటించింది. తన ప్రయాణం గురించిన ఆసక్తికర సంఘటనలెన్నో మీ కోసం..
నా దృష్టిలో నాట్యం అనేది ఒక ఉపాసన. ఒక ఆరాధన. అంతకు మించి సాంస్కృతిక, ఆధ్యాత్మిక తరంగం. అందుకే నేను నా దగ్గరికి వచ్చే పిల్లలు ప్రతి ఒక్కరికీ దేవతా ఉపాసనను అలవాటు చేస్తాను. మనసు శుద్ధిగా ఉన్నప్పుడే శివ స్వరూపమైన నాట్యాన్ని మనం ఆకళింపు చేసుకోగలం. నేను కూడా దీని కోసమే కొన్నేండ్లుగా భైరవ ఉపాసన చేస్తున్నా. అయితే ఇంజినీరింగ్ చదివిన నేను నాట్యాన్ని ఇంతగా ప్రేమించడానికీ ఒక నాట్యాలయం స్థాపించడానికీ కారణాలు ఏమిటన్నవి కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తాయి.
నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. ఇక్కడే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశా. మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగమూ సంపాదించా. మా అమ్మానాన్నలు పద్మాకర్ భర్డే, చంద్రిక భర్డేలు. నాకు చిన్నప్పటి నుంచీ మన సంస్కృతీ సంప్రదాయాలను జీవితంలో భాగం చేస్తూ పెంచారు. అందులో భాగంగానే కూచిపూడి కూడా నేర్చుకున్నా. శివుడన్నా ఎంతో ఇష్టం. ఆఫీసులో చేరిన కొత్తలో నేను డ్యాన్సర్‌ని అని తెలిసి ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వమని కోరారు వాళ్లు. దాంతో నాకిష్టమైన శివతాండవ నృత్యం చేశాను. ఆ ఫంక్షన్‌కి వైస్ ప్రెసిడెంట్, సీఈఓలాంటి పెద్ద స్థాయి ఆఫీసర్లంతా హాజరయ్యారు. నా పర్ఫామెన్స్ పూర్తి కాగానే పెద్దవాళ్లు చాలామంది ఉద్వేగానికిలోనై ఏడుస్తూ, వచ్చి నా పాదాలను తాకి నమస్కారం చేశారు. నాకు ఆనందమూ, ఆశ్చర్యమూ ఒకేసారి కలిగాయి. కళకు ఇంత విలువ ఉంటుందా అనిపించింది. మరో సందర్భంలో చెన్నైలో ఉంటున్నప్పుడు చుట్టు పక్కల ఉన్న చిన్న పిల్లలంతా ‘మాకు కూడా డ్యాన్స్ నేర్పించవచ్చు గదా అక్కా…’ అంటూ అడిగేవారు. అప్పుడే నాకు డ్యాన్స్ స్కూల్ స్థాపించాలన్న ఆలోచన వచ్చింది.
అలా 2012 సంవత్సరంలో నేను శ్రీ హిరణ్మయి నృత్యాలయ పేరిట హైదరాబాద్‌లో ఒక స్కూల్ ప్రారంభించా. అనుకోకుండానే అక్కడ ఎంతో మంది పిల్లలు వచ్చి చేరారు. మరోవైపు నృత్యం గురించి తెలుసుకునే కొద్దీ నాకు దాని మీద ఆసక్తి పెరగసాగింది. ముఖ్యంగా నాట్యానికీ శివుడికీ ఉన్న అనుబంధం గురించి బాగా చదివా. అందుకే ‘కూచిపూడి నృత్యంలో శివతత్వం- శాస్త్రీయ, ఆధ్యాత్మిక అధ్యయనం’ అనే సబ్జెక్టు తీసుకుని పీహెచ్డీ చేశా. ఇందుకోసం జ్యోతిర్లింగ క్షేత్రాలన్నింటినీ రెండుసార్లు సందర్శించా. చార్ధామ్, పంచభూత మహా లింగాలనూ చూశా. అయితే శివుడి కథల్లో ఉన్న కొన్ని విషయాలు నన్ను ఆకట్టుకునేవి. వాటికి సాక్ష్యాలు పరిశోధించే పనిలో పడ్డా. ఉదాహరణకు పార్వతీ, పరమేశ్వరులు పాచికలాడే ఘట్టం మనకు తెలిసిందే. మా మూలాలు మహారాష్ట్ర కావడం వల్ల అక్కడి తుల్జాభవానీ, భవానీ శంకర్లే ఇలా ఆడారని పెద్దలు చెప్పుకోవడం విన్నా. అన్ని తరాల నుంచి మాదాకా వచ్చింది అంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉండి ఉండాలి కదా! నిరాధారంగా అలా చెప్పరు … అనిపించింది. అందుకే నేను ఆ క్షేత్రానికి వెళ్లి పూజారులు, సిబ్బంది, పెద్దలందరితో మాట్లాడా. అక్కడ అటువంటి ఆధారమేదీ లేదని చెప్పారు. అయితే గుడి ముందు ఓ గాజులమ్మే పెద్దావిడ కనిపించింది. కాసిన్ని గాజులు కొని, ఆమెను అడిగా, ‘ఇక్కడ శివపార్వతులు పాచికలాడిన చోటు ఉందట మీకేమైనా తెలుసా’ అని. ఆమె నన్ను దూరంగా ఉన్న ఒక చిన్న ఆలయానికి తీసుకెళ్లింది. అక్కడ స్వామి, అమ్మవార్లు ఉన్నారు. పచ్చీస్ పట్టాను చక్కగా అలంకరించి ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టారు. ఇదే కోణంలో నా పరిశోధన సాగుతూ వచ్చింది.
ప్రాజెక్టు చేస్తూనే నేను శివుడికి సంబంధించిన రూపకాన్ని చేద్దామని ప్రయత్నిస్తుంటే, శక్తి స్వరూపిణి అమ్మవారిని వదిలేస్తే ఎలా అంది అమ్మ. క్రమేణా నాకూ అదే అనిపించింది. అందుకే ఆమెనూ చేర్చా. భారతదేశంలోని నాలుగు మూలల నుంచి నాలుగు శివక్షేత్రాలను ఎంచుకోవాలనుకున్నా. అందులో సైన్సునూ చొప్పించా. దక్షిణ భారత దేశం నుంచి మీనాక్షీ, సుందరేశ్వరులను, ఉత్తర భాగం నుంచి అన్నపూర్ణా విశ్వేశ్వరులను, తూర్పు వైపు నుంచి మహాకాల భైరవ, దక్షిణ కాళి అమ్మవార్లను, పడమర దిక్కు నుంచి తుల్జా భవానీ, భవానీ శంకర్లనూ తీసుకున్నా. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన శివుడి కథల్ని నా రూపకంలో జొప్పించా. అలాగే సైన్సునీ. అంటే కాశీ విశ్వేశ్వరుడు ప్రాణశక్తి అయితే అన్నపూర్ణమ్మ పోషకాహారం అందించే మూర్తి… ఇలా అన్నమాట. అయితే ఈ క్రమంలోనే నాకు రాజర్షి నంది నాథ్ పరిచయం అయ్యారు. ఆయన ద్వారా కాలభైరవ ఉపాసన తీసుకున్నా. ఇప్పటికీ సాధన చేస్తా. ఆధ్యాత్మిక బలం వల్ల అనుకున్న పనులు చక్కగా అవుతాయి. అందుకే నా దగ్గర చేరే నాలుగేండ్ల పిల్లలకైనా సరే దేవతా ఉపాసన విధిగా నేర్పిస్తా.
మొత్తానికి నా పరిశోధన, ఆసక్తి అన్నింటినీ కలిపి ‘ఏకమ్ అర్ధనారీశ్వరం’ అనే రూపకం పూర్తిచేశా. విష్ణుమూర్తి గురించి ఏకమ్ చతుర్భుజం, ఏకమ్ కృష్ణం, శ్రీరామ విజయగమనమ్ అనే రూపకాలనూ కట్టా. ఇందులో దేనికవే నాకు ప్రత్యేకం. అయితే రెండేండ్ల క్రితం ఏకమ్ అర్ధనారీశ్వరం టికెట్లు బుక్ మైషోలో పెట్టాం. సీట్లన్నీ నిండిపోగా చాలా మంది నిలబడి చూశారు. మరికొందరు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ రోజు చప్పట్ల వాన కురిసింది. అప్పటి సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణకు అది ఎంతో నచ్చి మా ప్రోగ్రాం కాశీలో ఏర్పాటు చేయించారు. తర్వాత ఇండోనేషియా, శ్రీలంకల్లోనూ ప్రదర్శనలిచ్చాం. రష్యా పర్యటన మరో అనుభూతి. ప్రస్తుతం కళలకు సంబంధించి సీబీఎస్ఈ పేపర్లను తయారు చేస్తున్నా. ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ బోనాలు, బతుకమ్మలాంటి తెలంగాణ పండుగలు సహా భారత సంస్కృతీ సంప్రదాయాలను విదేశీ విద్యార్థులకు చెబుతున్నా. డ్యాన్స్‌కు సంబంధించి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్లాంటివీ నేనే చూసుకుంటా. అటు ఉద్యోగమూ చేస్తున్నా. నాట్యాలయం ద్వారా కనీసం వెయ్యి మందికి కూచిపూడి నేర్పించా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లాంటి వివిధ రాష్ర్టాల నాట్య సంస్థల నుంచి జీవన్ గౌరవ్ పురస్కార్, పర్ణశాల, చారుశీల లాంటి అవార్డులు చాలానే అందుకున్నాను. ఇక, నా పనుల్లో చెల్లీ, తమ్ముడూ నిరంతరం వెన్నుదన్నుగా ఉంటారు. వాళ్లే నా బలం. నా దృష్టిలో జవాన్లు భౌతికంగా దేశాన్ని కాపాడుతుంటే, ఆర్టిస్టులు తమ కళ ద్వారా అందులోని సంస్కృతిని కాపాడుతారు. ఒక జాతి మనుగడకు రెండూ అవసరమే!
విశ్వ వేదిక మీద నాట్యాన్ని ప్రదర్శించడం అన్నది ఒక గొప్ప మానసిక అనుభూతిని కలిగిస్తుంది. మేం పాల్గొనే అంతర్జాతీయ డ్యాన్స్ ఫెస్టివల్లో 22 దేశాలకు చెందిన వాళ్లు వచ్చారు. అక్కడ మమ్మల్ని చూడగానే అవతలి వాళ్లు ఇండియా, తెలుగు… అని అంటుంటే ఎంతో సంతోషమేసింది. అది మన ఉనికి. అయితే భారత్ అంటే అక్కడి వారికి తాజ్ మహల్, బాలీవుడ్… అందులోని నటులు ఇవే తెలుసు. కానీ మా ప్రదర్శన ద్వారా ఇండియా అంటే అంతకు మించి సనాతన సంప్రదాయం, కళలు కలిగిన దేశమని చాటిచెప్పాం. అక్కడి మేయర్, మంత్రులు మా ప్రదర్శనను ఎంతగానో మెచ్చుకున్నారు. వందల మంది ఇన్‌స్టాలో ఫాలోయర్లుగా మారారు. ఇప్పుడు అక్కడి వారికి ఇండియా అంటే కూచిపూడి నృత్యమూ గుర్తొస్తుంది.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి,
– సీఎం ప్రవీణ్