పొతంగల్, జూలై 21 : నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. మండలంలో ఉన్న మంజీరా నదిని తోడేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాత్రివేళ అక్రమంగా తరలిస్తుండడంతో ఇటు రోడ్లు ధ్వంసమవుతుండగా, అటు వాహనాల శబ్దానికి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పట్టుబడితే కేసులు పెడతారని భావించి, అతివేగంతో దూసుకెళ్తున్నారు. ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు వట్టిపోయే పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా పలుచోట్ల తాగునీటి సమస్య తలెత్తుతున్నది. ఇసుక రవాణా యథేచ్చగా కొనసాగుతున్నా ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపా దడపా ఫిర్యాదులతో ఒకటి, రెండు వాహనాలను పట్టుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల అనుమతుల పేరిట ఇసుకను తరలించి అక్రమంగా వేరే చోట అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని, ఒకే వేబిల్లుపై అధిక సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే లబ్ధిదారుడు ఇసుక కోసం స్థానికంగా ట్రాక్టర్ యాజమానులను సంప్రదించి అనుమతి తీసుకుంటున్నాడు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు లబ్ధిదారుడికి ఐదు లేదా ఆరు ట్రాక్టర్లు పంపించి, మిగతా ట్రాక్టర్ల ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చీకటి పడితే చాలు మండలంలోని మంజీరా పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ముందుగా ద్విచక్ర వాహనదారులు పరిసర ప్రాంతాలను గమనించి డ్రైవర్లకు సమాచారం ఇస్తే ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తాయి. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలకు అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఇసుక వాహనాలు తరలివెళ్తున్నాయి. తరలించిన ఇసుకను వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రాత్రివేళ ఇసుక వాహనాలు వెళ్లడంతో వాహనాల శబ్దానికి నిద్ర పట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇటీవల పలుమార్లు రాత్రివేళ ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ అధికారుల కండ్లు కప్పి ఇసుకాసురులు రవాణా కొనసాగిస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అక్రమార్కులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ వేయాలని జిల్లా అధికారులను మండలవాసులు కోరుతున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించేది లేదు. రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. ఇటీవల రాత్రి వేళలో రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని చర్యలు తీసుకున్నాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
-సందీప్, తహసీల్దార్, పొతంగల్