Jagapathi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు పలువురు నటీనటుల పాత్రలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు జగపతిబాబు పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథలో ఆయన పూర్తిగా పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. సినిమా విజయానంతరం జగపతిబాబు, దర్శకుడు బుచ్చిబాబు సన కలిసి పాల్గొన్న ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో గుర్తింపు, నటనకు లభించే ప్రశంసలపై జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అప్పలసూరి పాత్రకు థియేటర్లలో వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ జగపతిబాబు ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. “ఈ పాత్రను ఏదైనా మలయాళం, తమిళం లేదా హిందీ నటుడు చేసి ఉంటే, అందరూ అతడిని ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ మీరు తెలుగు నటుడు కావడం మీ బ్యాడ్ లక్. మనవాళ్లు మన ప్రతిభను అంతగా సెలబ్రేట్ చేయరు” అని ఆ దర్శకుడు తనతో అన్నట్లు జగపతిబాబు వెల్లడించారు. అలాగే, గతంలో ‘అరవింద సమేత’లో చేసిన వీరారెడ్డి పాత్ర తర్వాత నటుడిగా తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ‘అప్పలసూరి’దేనని ఆయన పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఫలితం కూడా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.
మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు ఈ పాత్ర ఎంపిక వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘పెద్ది’ సినిమాలో హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్ర అప్పలసూరిదేనని, ప్రేక్షకుల్లో ఆ పాత్రపై జాలి, అనుబంధం కలగాలని తాను కోరుకున్నానని చెప్పారు. అయితే జగపతిబాబు ఎప్పుడూ రాయల్ లుక్లో, స్టైలిష్ పాత్రల్లో కనిపిస్తారని, అందువల్ల గ్రామీణ వ్యక్తి పాత్రలో ఆయనను ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదా అన్న సందేహం మొదట్లో తనకు వచ్చిందని బుచ్చిబాబు తెలిపారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో స్టోరీ బోర్డు రూపొందించి పరిశీలించగా, ఈ పాత్రకు జగపతిబాబు కంటే సరైన ఎంపిక మరొకరు లేరని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పాత్రకు తాను ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే అసంతృప్తిని కూడా జగపతిబాబు వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది