AP News : తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తులు నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా విగ్రహాన్ని ఒక కాషాయ గుడ్డలో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విగ్రహం లేకపోవడంతో ఘాట్ రోడ్డు గుండా వెళ్లే భక్తులు ఆ స్థలంలో ఉన్న బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని ఆవేదనతో ముందుకు కదులుతున్నారు.
ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని విగ్రహాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు..? అతను ఘాట్ రోడ్డు నుంచి ఎటువైపు వెళ్లాడు..? అనే కోణంలో తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్థామని పోలీసులు తెలిపారు.