పేరుకే వానాకాలం. ఎండలు మాత్రం వేసవిలా దంచుతున్నాయి. ఏదో ఒకట్రెండు రోజులు వానలు కురిసినా.. ఈ వానకాలమంతా ఎండలదే పైచేయి. ఇలాంటి ఎండల్లో రోజూ ప్రయాణం చేసే వారికి ఇబ్బందే! ప్రతి రోజూ ఎండలో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంది. అసలే అందం పట్ల ఎక్కువ ఆసక్తి చూపే టీనేజర్లపై ఈ ప్రభావం చర్మంపైనే కాదు ఆలోచనలపై కూడా ఉంటుంది. ఎండల్ని తప్పించుకోలేరు కాబట్టి ట్యాన్‌ని తగ్గించుకునేందుకే ప్రయత్నించాలి. కిచెన్‌లో అందుబాటులో ఉండే కూరగాయలు, పాలు, ఇతర ఆహార పదార్థాలతో ఫేస్‌ప్యాక్ తయారు చేసుకుంటే అదనపు ఖర్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్యాన్ తగ్గించుకోవచ్చు. అదెలాగంటే… టమాటా ముక్కను తీసుకుని, దానిని ముఖంపై మర్దనా చేసుకోవాలి.
ఇలా పది నుంచి పదిహేను నిమిషాలపాటు చేయాలి. ఇలా రుద్దుతూ ఉండటం ఇబ్బందిగా అనిపిస్తే.. టమాటా రసం తీసి, దానిని పెరుగులో కలపాలి. ఆ ప్యాక్‌ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడగాలి. టమాటాలు కాకపోతే.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. తర్వాత దానిని ముఖానికి రాసుకోవాలి. పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేస్తే ట్యాన్ పోతుంది. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేయాలి. ఎండ వల్ల వచ్చిన ట్యాన్‌ని తగ్గించుకుంటూనే అప్పుడప్పుడూ ముఖ వర్చస్సు పెంచే మరో చిట్కాను కూడా పాటించాలి. బియ్యం పిండిలో కొద్దిగా తేనె, పాలు కలిపిన ప్యాక్‌ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత వేళ్లతో రుద్దుతూ ఆ ప్యాక్‌ని తొలగించాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది.