– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా
రుద్రంపూర్, జూలై 22 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ముస్లిం శ్మశానవాటికల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమిని కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా కోరారు. ఈ మేరకు బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ సుజాతకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం పాల్వంచ పట్టణ ప్రజలు వినియోగిస్తున్న ముస్లిం శ్మశానవాటిక లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటంతో ఖననాలకు తగిన స్థలం లేక ముస్లిం కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అదేవిధంగా కొత్తగూడెం ప్రాంత ప్రజలు వినియోగిస్తున్న శ్మశానవాటిక కూడా గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండి ఖననాలతో పూర్తిగా నిండిపోయిందని తెలిపారు.
పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో కలిపి సుమారు 60 వేల మంది ముస్లింలు నివసిస్తున్నప్పటికీ, కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక ముస్లిం శ్మశానవాటిక ఏర్పాటుపై నేటి వరకు ఈ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సరైన చొరవ చూపిన దాఖలాలు లేవని యాకూబ్ పాషా విమర్శించారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రభుత్వ లేదా మున్సిపల్ భూమిని గుర్తించి ముస్లిం శ్మశానవాటికల కోసం కేటాయించి అట్టి స్థలానికి ప్రహరీ, అనుసంధాన రహదారి, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా ముస్లిం సమాజం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు సానుకూలంగా పరిశీలించి వెంటనే శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని యాకూబ్ పాషా విజ్ఞప్తి చేశారు.