హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సినిమా కళాకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, యూసుఫ్‌గూడలో మంగళవారం నిర్వహించిన తన సభకు సినిమా కార్మికులను భయపెట్టి తరలించారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి యూసుఫ్‌గూడ సభలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సినీ కార్మికులకు ఎన్నికల హామీలను గుప్పించారని విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం స్పందించి, సుమోటోగా తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాము కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సీఎం తన అబద్ధాలతో సినిమా చూపించే వారికే తన సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. నటుడు అల్లు అర్జున్ లాగా తమను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో సినీ కార్మికులు ఆ సభకు వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించారని ఆరోపించారు. తన సభకు తరలిరావాలని సినిమా కార్మికులను బలవంతం చేసినా తక్కువ మందే రావడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని తెలిపారు. హైదరాబాద్‌కు హాలీవుడ్‌ను తీసుకురావడం కాదని, ఉన్న సినిమా రంగాన్ని కాపాడితే సరిపోతుందని దుయ్యబట్టారు. గత రెండేండ్ల నుంచి సినిమా రంగాన్ని భయభ్రాంతులకు గురిచేసి, ఉన్నట్టుండి వారిపై సీఎంకు కొత్తప్రేమ పుట్టకొచ్చిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల అంశంపై జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. సినిమా రంగ కార్మికులంతా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి గెలిపించనున్నారని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను కాంగ్రెస్ గూండాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆ పార్టీ నాయకులు పలుచోట్ల ఓటర్లపై బెదిరింపులకు దిగుతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. సినిమారంగం వాళ్లకే సీఎం రంగులకల చూపించారని ఎద్దేవా చేశారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డిని ఇప్పుడు ఎవరూ నమ్మేస్థితిలో లేరని, నియోజకవర్గ ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని స్పష్టం ఆయన చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో పోలీసులు, గూండాల రాజ్యమేలుతున్నట్టుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బస్తీల్లో రాత్రిపూట తిరుగుతూ కాలనీవాసులను, సంఘాల నేతలను, అపార్టుమెంట్ వాసులను కాంగ్రెస్ గూండాలు, రౌడీలు బెదరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలపైనా దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. పోలీసులు కూడా ఇలాంటి బెదిరింపులకు గురి చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆమె కూతురుపైనా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, ఆయన అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహలో పడిందని, అందుకే సొంత పార్టీ నేతలపైనే కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ అనుమతి తీసుకుని ప్రచారం చేస్తుంటే కూడా కాంగ్రెస్ నేతలు.. ఆ ప్రచారాన్ని అడ్డుకుని, ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఒక వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి సినిమా రంగాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని బీఆర్ఎస్ ఎమ్యెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. నటుడు అల్లు అర్జున్ను జైల్లో పెట్టినం దుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా? హైడ్రా పేరుతో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసి నాగార్జున కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఓట్లు వేయాలా? సమంతపై నీచాతి నీచంగా మాట్లడినందుకా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని నిలదీశారు. సినిమా కార్మికుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటుచేసిన సభకు పట్టుమని 500మంది కూడా రాలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడలో జరిగిన సినీ కార్మికుల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, చట్టవిరుద్ధంగా హామీలు ఇచ్చిన ఆయనపై సత్వరమే కేసు నమోదు చేసి సుమోటోగా విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, పార్టీ లీగల్ టీం మెంబర్లు బుధవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఆయనను కలిశారు. ‘వయలేషన్ ఆఫ్ మోడల్ కండక్ట్ పే రా-1 ప్రకారం పార్టీలు, అభ్యర్థులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం నిషేధం. ఎంసీసీ పేరా-3 ప్రకారం అనుచిత పదజాలం, రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేయవద్దు. ‘ఎంసీసీ సెక్షన్ 11(1) అనుబంధం-10, చాప్టర్-1v, పేరా 4,11 ప్రకారం.. మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారంలో భాగస్వాములైన వారు ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధమైన హామీలను ఇవ్వరాదు. ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించరాదు. ప్రభుత్వపరంగా చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలు వేయరాదు. పనులకు శంకుస్థాపన చేయరాదు’ అని బీఆర్ఎస్ నేతలు వివరించారు. ఈ నియమ నిబంధనలను సినీ కార్మికుల సన్మానసభలో సీఎం రేవంత్‌రెడ్డి యథేచ్ఛగా ఉల్లంఘించారని ఎస్ఈవో దృష్టికి వారు తీసుకెళ్లారు. ‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 123(04) ప్రకారం ఉద్దేశపూర్వకంగా ప్రజలను కులమతాలుగా విభజించి మాట్లాడటం, ప్రత్యర్థుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేయడం నేరమని, సెక్షన్ -125 ప్రకారం వ్యక్తుల మనోభావాలను గాయపరిచేలా మాట్లాడిన వారు శిక్షార్హులు’ అని ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బీఎన్ఎస్-2023 సెక్షన్ 294 ప్రకారం.. జనసముహ ప్రాంతాల్లో దురుసుగా మాట్లాడటం నిషేధమని, సెక్షన్ 351, 356 ప్రకారం.. హింసను రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేయడం, ప్రచారం చేయడం నేరమని వివరించారు. అసభ్య పదజాలం వాడిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌ను ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా సినీ కార్మికులకు హామీలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నుంచి తొలగించాలని విన్నవించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నేతలను ఉద్దేశించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ‘చంపేస్తాం’ అని బెదిరిస్తున్నారని తెలిపారు. అభ్యర్థి మాట్లాడిన వివరాలను అందజేశారు. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. రాష్ట్ర పోలీసుల స్థానంలో ఎన్నికల వేళ శాంతిభద్రతల బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, వెంటనే కేంద్రపరిశీలకుడిని పంపాలని విన్నవించారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకంలేదని స్పష్టంచేశారు. ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని గుర్తుచేశారు.