నల్లబెల్లి, జూన్ 05 : నకిలీ విత్తనాల ముఠా సభ్యుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. వర్షాలు ప్రారంభం కావడంతో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నిషేధిత BT3 (లూజ్) విత్తనాల విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం, కొండాయిలుపల్లె, కొండాపురం, మామిండ్ల వీరయ్య పల్లె తదితర గ్రామాలకు సంబంధించిన కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి నకిలీ BT3 విత్తనాలను దిగుమతి చేసి రైతులకు కిలో రూ,3000 లకు రైతులకు విక్రయిస్తున్నారు.
అధిక దిగుబడి వస్తుందని కొందరు రైతుల నమ్మకాలను నకిలీ విత్తనాల వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. అయితే BT3 సాగు చేసిన రైతులకు ఇదే నకిలీ విత్తనాల ముఠా సభ్యులు పంటపై పిచికారి చేసేందుకు ప్రభుత్వ నిషేధిత గ్లైపోసెట్ మందులు సైతం ముందస్తుగానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందాలో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఫర్టిలైజర్స్ డీలర్లు సైతం రాత్రి వేళల్లో రైతులకు నకిలీ విత్తనాలను డోర్ డెలివరీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉంటే ప్రతి వానకాలం సీజన్లో ఇదే ముఠా సభ్యులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిసినప్పటికీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా ఎరువుల దుకాణాల తనిఖీలు చేస్తున్నామంటూ చేతులు దులుపుకోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నల్లబెల్లి మండల వ్యాప్తంగా జరుగుతున్న నకిలీ BT3 విత్తనాల అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.