హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో మంగళవారం గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. డప్పు చప్పుళ్లు, కోలాటం, భజనలు, యువకుల నృత్యాలు, భక్తుల కోలాహలం నడుమ వినాయకుడి శోభాయాత్ర అంతటా సందడిగా సాగింది. హైదరాబాద్ నగరంలోని రోడ్లు జాతరను తపలించాయి. భైంసా, ముథోల్, నారాయణపేట్, ఉట్కూర్, కరీంనగర్, మహబూబ్‌నగర్ పరిధిలో మధ్యాహ్నానికే విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. జడ్చర్ల, తాండూర్, మక్తల్, నిర్మల్‌లో కూడా ప్రశాంతంగానే ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన శోభాయాత్రకు 35 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ నిర్వహించినట్టు డీజీపీ జితేందర్ చెప్పారు. రాజధానిలో ట్రై కమిషనరేట్లకు 25 వేల మంది సిబ్బందిని కేటాయించినట్టు తెలిపారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో సుమారు లక్ష వరకు విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర ఉదయం 6.32 గంటలకు ప్రారంభంకాగా, భక్త జనసందోహం నడుమ నగర వీధుల గుండా 8 గంటలపాటు యాత్ర సాగింది.
సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పర్యటించేందుకు రావడంతో పాత సచివాలయం గేటు వరకు వచ్చిన మహాగణపతి శోభాయాత్ర గంటసేపు నిలిచిపోయింది. సీఎం పర్యటన ముగిసిన తర్వాత శోభాయాత్ర ముందుకు సాగింది. సుమారు గంటసేపు భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వలంటీర్లు రోడ్లపైనే నిలబడిపోయారు. అనంతరం మధ్యాహ్నం 1.37 గంటలకు మహా గణపతి గంగమ్మ ఒడికి చేరడంతో ‘మహా’ ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనానికి అగ్నిమాపశాఖ నుంచి మొత్తం 1,317 మంది సిబ్బందితో మోహరించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 126 వాటర్ టెండర్లు, 11 బోట్లు, 19 చిన్న అగ్నిమాపక వాహనాలు, 66 మిస్ట్ బుల్లెట్లు, 30 రెస్క్యూ రెస్పాన్స్ బృందాలతో విధులు చేపట్టినట్టు తెలిపారు. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 19 పెద్ద అగ్నిమాపక వాహనాలు, 16 మిస్ట్ బుల్లెట్లు, మూడు బోట్లు, 4 మినీ రెస్క్యూ టెండర్లు, 305 మంది సిబ్బందిని కేటాయించినట్టు చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్దకు వేలాదికి తరలివచ్చిన భక్తుల తోపులాటతో పలువురు మహిళలు, వృద్ధులు గాయాలపాలయ్యారు. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో లంబోధరుడి లడ్డూలకు ఏటేటా విలువ పెరుగుతున్నది. భక్తులు పోటీలు పడి మరీ వేలంలో లక్షలకు లడ్డూలను దక్కించుకుంటున్నారు. ఈసారి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తీ రిచ్‌మౌండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలంలో గణనాథుడి లడ్డూని ఆల్‌టైం రికార్డ్ ధరకు సొసైటీ సభ్యులే సొంతం చేసుకున్నారు. రూ.1.87 కోట్లకు ఆ లడ్డూను వారు దక్కించుకున్నారు. నిరుడి కంటే రూ.62 లక్షల అధిక ధర పలికింది. బాలాపూర్ లడ్డూ నిరుడి కంటే రూ.3.01 లక్షల అధిక ధరతో రూ.30.01 లక్షలతో బాలాపూర్‌కు చెందిన కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొలన్ శంకర్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. నగరవ్యాప్తంగా పలుచోట్ల లడ్డూల వేలం పోటాపోటీగా సాగి లక్షల ధర పలికింది.