హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాలలో విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. కాలనీలు, వీధులు లంబోదరుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి. హైదరాబాద్‌లో ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల శోభయాత్రకు సర్వంసిద్ధమైంది. దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సాగే గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఖైరతాబాద్ భారీ గణనాథుడు ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ చుట్టూ 11 పెద్ద క్రేన్లు, 40 చిన్న క్రేన్లు ఏర్పాటు చేశారు. బహుబలి క్రేన్ పాయింట్ నంబరు 11 వద్ద ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరగనుంది. ట్రాఫిక్ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి హెల్ప్‌లైన్ నంబర్లు 87126 60600, 90102036 26కు కాల్ చేయాలని అధికారులు వెల్లడించారు.
నిరంతరం నిఘా..అనుక్షణం పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు అన్ని విభాగాలతో కలిపి 40వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసుశాఖ తెలిపింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ విగ్రహ కమిటీ, ఉత్సవ నిర్వాహకులతో ఇప్పటికే ఆయా స్టేషన్ల పరిధిలోని ఎస్హెచ్ఓలు సమావేశాలు నిర్వహించారని వెల్లడించింది. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 30వేల మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపింది. నిమజ్జనోత్సవాలను డీజీజీ ఆఫీస్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు పోలీసుశాఖ స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానించిన సీసీ కెమెరాలతో ప్రతీక్షణం నిఘా పెడుతామని తెలిపింది. అనుమానాస్పద, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా పెడుతామని పేర్కొంది. సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశామని తెలిపింది. ‘మిలాద్ ఉన్ నబీ’ కమిటీలతో హైదరాబాద్ సీపీ మాట్లాడినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది ఫైర్ సిబ్బంది, బోట్లు, అగ్నిమాపక యంత్రాలు, మిస్ట్ బుల్లెట్లు, రెస్క్యూ బృందాలను మోహరించినట్టు వివరించారు.