జయశంకర్ భూపాలపల్లి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కొనాల్సిందేనని, లేకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, శ్రేణులతో కలిసి వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు.
సుమారు గంటపాటు కొనసాగిన ఆందోళనతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. గండ్ర మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాను నిర్ణయించిన ధాన్యానికే బోనస్ ఇస్తానని, ఇతర వడ్లు పండించొద్దని చెప్పడం దారుణమని అన్నారు. ఇప్పటికే రైతులు ధాన్యం ఎంపిక చేసుకొని నారు పోసి పంట అలికేందుకు సిద్ధమయ్యారని, ఈ సమయంలో ఏడు రకాల సన్న వడ్లు మాత్రమే పండించాలని ఆంక్షలు విధించడం సరికాదని సూచించారు. యూరియా సైతం యాప్‌తో సంబంధం లేకుండా నేరుగా రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.