కృష్ణ కాలనీ, డిసెంబర్ 26 : పాలనలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth) ఫెయిల్ అయ్యారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ రేవంత్రెడ్డి మాటలను కాంగ్రెస్ నాయకులే వెక్కిరిస్తున్నారని, కనుకనే ఆ పార్టీలో భవిష్యత్ లేదని కేసీఆర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చతికిల పడ్డదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ రాజునాయక్ మాజీ ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.