హైదరాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్‌కు కాపలాదారులని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై వారు మాట్లాడకుండా బీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పిస్తూ, సీఎం రేవంత్‌కు వంతపాడుతూ కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన టీసాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌పై ఒంటికాలిపై లేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి వారిద్దరూ రక్షణ కవచంగా మారారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం వారి సొంత పార్టీకే చెందిన ఎంపీ ఈటల రాజేందర్‌పై కత్తులు నూరుతున్నారని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేసినా కేసీఆర్ పరపతి తగ్గబోదని స్పష్టంచేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మందిని ఎంపీలుగా గెలిపించి లోక్‌సభకు పంపితే కేంద్రం నుంచి నయాపైసా తేలేదని, ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలను ఉద్ధరించిందేమీలేదని నిప్పులు చెరిగారు. విత్తనాలు, వరి నాట్లు వేసి యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతుల గోస తీర్చడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ను ఆ రెండు పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయాయని కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్చేయకపోవడంతో మేడిగడ్డ నుంచి వందలాది టీఎంసీల నీళ్లు వృథాగా పోతుంటే కనిపించడం లేదా? ఎల్ఎండీ ఆయకట్టు రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదు?’ అని బండి సంజయ్‌కి ప్రశ్నలు సంధించారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరిట 20 నెలలుగా మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయించడంలేదని విమర్శించారు. తన గురువు చంద్రబాబు మెప్పుకోసం రేవంత్ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరేందుకు ఏ నాయకుడూ సిద్ధంగా లేరని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాటలు సత్యదూరమని కొట్టిపారేశారు.