హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా సీఎం రేవంత్ రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. రైతుల కోసం ముందుచూపుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే కాంగ్రెస్, బీజేపీలు కుట్రపూరితంగా పడావు పెట్టాయని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహంవ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ భావజాలంలేదని, ఆయన కాంగ్రెస్‌లో సబ్ జూనియర్ అని ఎద్దేవాచేశారు. రేవంత్ సీఎం కావడమే రైతులకు శాపమని, మూడేండ్లుగా మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోయనందుకు సీఎం ముక్కును నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలను పక్కన పెట్టి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కొట్లాడుకోవడానికే సమయం కేటాయిస్తున్నారని గండ్ర విమర్శించారు. దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపి నీటిని ఎత్తిపోయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నదా.. ?అని ప్రశ్నించారు.
ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ వద్ద లక్షా పది వేల క్యూసెకుల నీటి ప్రవాహం ఉన్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై హైకోర్టుకు ఇచ్చిన హామీని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని గండ్ర విమర్శించారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ విద్యార్థుల ఫీజు బాకీలను చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు.