గంగాధర, అక్టోబర్ 4: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి అలియాస్ వినయ్‌సాగర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నాడని, గంగాధర మండల కాంగ్రెస్ సర్పంచులు సైతం తనను అవమానాలకు గురిచేస్తున్నారంటూ మనస్తాపంతో ఆదివారం మధురానగర్ చౌరస్తాలోని అంబేదర్ విగ్రహం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
బీజేపీ నాయకులు, స్థానికులు సర్పంచ్‌ను అడ్డుకుని కరీంనగర్‌లోని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొండాయపల్లి గ్రామ అభివృద్ధిపై, గ్రామానికి ఆర్టీసీ బస్సు కోసం సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సత్యం తనపై అక్రమ కేసులు పెట్టించాడని, గంజాయి కేసు పెట్టిస్తామని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని వాపోయాడు. కేసు నమోదైనట్టు గంగాధర పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినట్టు ఆవేదన వ్యక్తంచేశాడు.
గంగాధర మండల సర్పంచుల వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ సర్పంచులు అవమానకరంగా మాట్లాడారని, కొండాయపల్లి ప్రభుత్వ భూమి విషయంతో రూ.3 లక్షలు, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తెలిపాడు. ఈ పరిస్థితికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సర్పంచులు బాధ్యులని పేర్కొన్నాడు.
కొండాయపల్లి సర్పంచ్ వినయ్‌సాగర్ ఆత్మహత్యకు యత్నించడానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌ను ఆదివారం పరామర్శించారు. వినయ్ సాగర్ లేఖ ఆధారంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.