నగోయా (జపాన్) : రెండు వారాల పాటు వేలాది మంది ఆసియా క్రీడాకారుల హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచిన 20వ ఆసియా గేమ్స్‌కు తెరపడింది. నగోయాలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 90 నిమిషాల పాటు సాగిన ముగింపు వేడుకలు కనువిందు చేశాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ జోఆన్ బిన్ హమద్ అల్ థానీ క్రీడలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఓసీఏ పతాకాన్ని 2030 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే ఖతార్‌లోని దోహా నగర ప్రతినిధులకు అధికారికంగా అందజేశారు. ఖతార్ హైజంప్ దిగ్గజం ముతాజ్ బార్షిమ్ నుంచి ఈక్వెస్ట్రియన్ రైడర్ జాసిమ్ అల్ కువారీ ఆసియాడ్ పతాకాన్ని స్వీకరించాడు.ముగింపు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన అథ్లెట్ల పరేడ్‌లో భారత ట్రాప్ షూటర్ నీరూ ధండా త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని ముందు నడిచింది. తెలుపు, నీలం రంగు దుస్తులు ధరించిన సుమారు 30 మంది భారత అథ్లెట్లు, అధికారులు ఈ మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. ‘వన్ ఆసియా’ అనే ఇతివృత్తంతో రూపొందించిన వేదికపై జపాన్ సాంప్రదాయ ‘బొన్-ఒడోరి’ నృత్యాలు, ‘మత్సుకెన్ సాంబా2’ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈసారి ఆసియా క్రీడల నిర్వహణలో జపాన్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. భారీ ఖర్చులతో ప్రత్యేకంగా అథ్లెట్స్ విలేజ్‌లు, కొత్త స్టేడియంలు నిర్మించకుండా.. అందుబాటులో ఉన్న వేదికలు, తాత్కాలిక నిర్మాణాలతో తక్కువ ఖర్చుతో క్రీడలను నిర్వహించింది. ఆరంభంలో హోటల్ వసతి సమస్యలు, రవాణా ఆలస్యం, అక్రిడిటేషన్ గందరగోళం ఎదురైనప్పటికీ.. నిర్వాహకులు త్వరగానే లోపాలను సరిదిద్ది పోటీలను విజయవంతంగా ముగించారు. 45 దేశాల నుంచి దాదాపు 11 వేల మంది అథ్లెట్లు పాల్గొన్న పోటీల్లో 54 ప్రపంచ రికార్డులు, 89 ఆసియా రికార్డులు బ్రేక్ అవడంతో ఈ ఆసియాడ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.