న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలు ఆదివారం మూడో రోజు కూడా కొనసాగాయి. జంతర్‌మంతర్ వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా ఓ సందర్భంలో బారికేడ్లపైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులకు, విద్యార్థులకు తోపులాట జరిగింది. అనంతరం నిరసనకారులు జంతర్మంతర్వైపు కదిలారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కూడాజ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్‌వైపు ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలారు. కొద్దిసేపు పోలీసులకు, ఆప్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. నిరసన కారులను నియంత్రించేందుకు పోలీసులు యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అధికారంలోని బీజేపీకి ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్ ఒక ఆయుధమని శివసేన (యూబీటీ) ఆరోపించగా, మహారాష్ట్రలో చేపట్టిన ‘సర్’ను వెంటనే రద్దు చేయాలని ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఠాక్రే సోదరులు సంయుక్తంగా ఆదివారం ముంబైలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ (ఎస్పీ) కేడర్ కూడా భాగస్వాములయ్యారు.
భవిష్యత్తులో దేశంలో నిర్వహించే ఏ ఎన్నికనైనా బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లా దేశీయులను సర్ ద్వారా తొలగించాలని భావిస్తే ఇంతవరకు అక్రమంగా నివసిస్తున్న ఎంతమంది బంగ్లా దేశీయులను గుర్తించారని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చాన్నాళ్లుగా దేశంలో జరిగిన ఓట్ల చోరీ గురించి ఆరోపిస్తున్నారని, దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన చూపారని కాంగ్రెస్ నేత తోరట్ పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కేరళ రాష్ట్ర పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్న కాలంలో కేఎస్టీపీ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపైన, అలాగే 2006లో ఆ పనులతో సంబంధం ఉన్న మలేషియా సివిల్ ఇంజనీర్ మరణంపైన ప్రాథమిక విజిలెన్స్ విచారణకు కేరళ హోం మంత్రి రమేశ్ చెన్నితల ఆదేశించారు. 2006లో జ్ఞానేశ్ కుమార్‌పై నిర్వహించిన ప్రాథమిక విజిలెన్స్ విచారణకు సంబంధించిన ఫైళ్లను కేరళ హోంశాఖ తెప్పించుకున్న కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
జ్ఞానేశ్‌పై విచారణ జరపాలని కోరుతూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) నాయకుడు మలయంకీళు వేణుగోపాల్ శనివారం ఫిర్యాదు చేసిన తర్వాత చెన్నితల తాజా విచారణకు ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జ్ఞానేశ్‌పై తదుపరి చర్యల గురించి ఆలోచించే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో(వీఏసీబీ)ను ఆదేశించినట్టు వర్గాలు చెప్పాయి. తాను ఆ ఫిర్యాదును పరిశీలించానని, ఆ ఆరోపణల్లో ప్రాథమికంగా వాస్తవం ఉందని గుర్తించానని విలేకరులతో మాట్లాడుతూ చెన్నితల తెలిపారు. విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ జరపడం అవసరం అని నేను బలంగా విశ్వసిస్తున్నాను అని ఆయన అన్నారు. సమగ్ర విచారణకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజిలెన్స్ డైరెక్టర్ మనోజ్ అబ్రహంను ఆదేశించే ముందు తాను ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో మాట్లాడానని కూడా ఆయన తెలిపారు.