నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
ఆసియా ఖండాన్ని హోరెత్తించిన ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ హంగామా ముగిసింది. భారత్ మరోసారి టాప్4లో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలిచింది. చివరి రెండు రోజుల్లో ఏకంగా 11 స్వర్ణాలు సాధించడంతో నాలుగో స్థానం ఖరారైంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ గత ఆసియాడ్‌తో పోల్చితే ఈసారి మన దేశం వెనుకబడింది. హాంగ్జౌలో 2023లో జరిగిన గత పోటీల్లో 28 స్వర్ణాలు సహా 106 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 21 స్వర్ణాలకే పరిమితమైంది. మొత్తంగా 21 పతకాలు, 7 స్వర్ణాలు తగ్గాయి. అదే సమయంలో చైనా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. 169 గోల్డ్ సహా మొత్తం 341 మెడల్స్‌తో మళ్లీ ‘టాప్’ లేపింది ఆతిథ్య జపాన్ 83 స్వర్ణాలు, 269 పతకాలతో రెండో స్థానం సాధిస్తే.. దక్షిణ కొరియా 39 పసిడి సహా 150 పతకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
హాంగ్జౌలో సాధించిన 28 స్వర్ణ పతకాల్లో భారత్ 8 స్వర్ణాలను మాత్రమే తిరిగి గెలిచింది. ముఖ్యంగా వ్యక్తిగత, పెయిర్ (జంట) ఈవెంట్లలో వచ్చిన 13 స్వర్ణాల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. అదే సమయంలో కొత్తగా 13 విభాగాల్లో భారత క్రీడాకారులు చాంపియన్లుగా అవతరించడం మాత్రం భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. అంటే భారత్ వద్ద కొత్త ప్రతిభ కొరవడలేదు. ఆ ప్రతిభను నిరంతర విజయాలుగా మార్చడం, ఒక తరం నుంచి మరో తరానికి విజయాలను కొనసాగించడం ఇప్పుడు అసలు సవాలుగా మారింది.
ఈ ఆసియాడ్‌లో భారత్ నాలుగో స్థానం అందుకోవడంలో కీలక పాత్ర టీమ్ ఈవెంట్లలో మంచి ప్రదర్శనే. క్రికెట్, హాకీ, కబడ్డీ పురుషుల, మహిళల జట్లు డబుల్ ధమాకా మోగిస్తూ ఏకంగా ఆరు స్వర్ణాలను అందించాయి. హాకీలో పురుషుల జట్టు టైటిల్ నిలబెట్టుకుంటే.. మహిళల జట్టు 44 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. క్రికెట్లోనూ భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. హాకీ, క్రికెట్ జట్లు ఒలింపిక్స్ బెర్తు కూడా దక్కించుకోగా.. కబడ్డీలోనూ అమ్మాయిలు, అబ్బాయిలు మరోసారి చాంపియన్లుగా నిలిచి అంచనాలను అందుకున్నారు.
ఆసియాడ్‌లో ఎక్కువ పతకాలు అందించే షూటింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో ఈసారి ఆశించిన ఫలితాలు రాలేదు. గత ఎడిషన్‌లో 7 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించిన భారత షూటర్లు ఈ సారి 15 మెడల్స్ కే పరిమితమయ్యారు. ఇందులో గోల్డ్ మూడే. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్‌పై భారీ అంచనాలు ఉండగా ఆమె నిరాశపరిచింది. అయితే ట్రాప్ షూటర్ నీరూ దంఢా రెండు స్వర్ణాలు, రజతం గెలవడం, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సురుచికమల్జీత్ తెచ్చిన స్వర్ణం ఊరటనిచ్చింది. ఇక, అథ్లెటిక్స్‌లో గాయం కారణంగా జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా దూరం కావడం భారత్‌కు భారీ లోటు. షాట్ తజీపుట్లో తజీందర్ హ్యాట్రిక్ స్వర్ణంపై కన్నేసినా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జ్యోతి యర్రాజి వంటి కీలక అథ్లెట్లను కూడా గాయాలు దెబ్బతీశాయి. గత ఎడిషన్‌లో 6 గోల్డ్ మెడల్స్ వచ్చిన అథ్లెటిక్స్‌లో ఈసారి ఒకే ఒక్క స్వర్ణం మహిళల 4×400 మీటర్ల రిలే టీమ్ అందించింది. ఇక, టెన్నిస్‌లో 4 దశాబ్దాల తర్వాత ఒక్క పతకం కూడా రాలేదు. బ్యాడ్మింటన్‌లో పురుషుల టీమ్ ఏకైక పతకం అది కూడా కాంస్యం మాత్రమే గెలిచి నిరాశ పరిచింది.

కొన్ని విభాగాల్లో భారత్ తేలిపోయినా మరికొన్ని ఆటల్లో మాత్రం నగోయా కొత్త చరిత్రకు వేదికగా మారింది. భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. రికర్వ్ విభాగంలో 17 ఏళ్ల కుంకుమ్, గోల్ఫ్‌లో ప్రణవి వ్యక్తిగత స్వర్ణాలతో చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు ఆసియా క్రీడల్లో భారత్ కు పెద్దగా పతకాలు అందని విభాగాల్లో ఇప్పుడు కొత్త చాంపియన్లు వెలుగులోకి రావడం శుభపరిణామం. బాక్సింగ్, రెజ్లింగ్‌లోనూ కొత్త బంగారు కథలు నమోదయ్యాయి. లవ్లీనా బొర్గోహైన్, పర్వీన్ హుడా, అంకుష్ పంగల్ బాక్సింగ్‌ల్లో స్వర్ణాలు సాధించగా.. రెజ్లర్లు సుజీత్ కల్కల్, అమన్ సెహ్రావత్ బలమైన ప్రత్యర్థులను ఓడించి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు.
రవాణా సమస్యలు, సుదీర్ఘ ప్రయాణాలు, వసతి ఇబ్బందులు భారత క్రీడాకారుల ఆటపై ప్రభావం చూపినా వాటినే మొత్తం ఫలితానికి కారణంగా చూడలేం. కీలక సమయాల్లో ఒత్తిడిని జయించలేకపోవడం, గాయాల నిర్వహణ, కొందరు స్టార్ క్రీడాకారులపై అధికంగా ఆధారపడటం, వ్యక్తిగత విభాగాల్లో ప్రత్యామ్నాయ విజేతలను తయారు చేయడంలో ఉన్న లోటు వంటి అంశాలు కూడా భారత్ ప్రదర్శనను ప్రభావితం చేశాయి. ఓవరాల్‌గా ఆసియాడ్‌లో నాలుగో స్థానంలో నిలవడం పూర్తిగా వైఫల్యం అనలేం. కానీ, పతకాల పట్టికను పరిశీలిస్తే భారత్, అగ్రస్థానంలో ఉన్న చైనా మధ్య ఉన్న అంతరం ఎంత పెద్దదో స్పష్టమవుతోంది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతున్న వేళ ఈ ఫలితాలు ఓ మెలుపు కొలుపు. టాప్-10 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలవాలని ఆశిస్తున్న భారత్ స్పోర్ట్స్ సైన్స్, ఫిట్ నెస్, మానసిక దృఢత్వం, రికవరీ, అత్యుత్తమ శిక్షణపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ ఆసియాడ్‌లో కనిపించిన కొత్త ప్రతిభను నిలబెట్టి, లోపాలను సరిదిద్దితేనే భవిష్యత్తులో మరింత పెద్ద విజయాలకు పునాదిగా మార్చగలం.
జపాన్ గడ్డపై తెలంగాణ ఆడ బిడ్డలు తానిపర్తి చికిత, ఇషా సింగ్ మెరిశారు. పెద్దపల్లికి చెందిన యువ ఆర్చర్ చికిత రెండో స్వర్ణాలతో అదరగొట్టింది. మహిళల టీమ్ ఈవెంట్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలకు గురి పెట్టింది. మిక్స్‌డ్‌లో భారత్‌కు ఒలింపిక్ బెర్తు కూడా అందించింది. మరోవైపు షూటింగ్ రేంజ్లో ఇషా సింగ్ ఆకట్టుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రజతం అందుకుంది. గత ఎడిషన్‌లో ఓ స్వర్ణం సహా నాలుగు పతకాలు నెగ్గిన ఇషా ఈసారి ఒక్కటే తెచ్చినా మను భాకర్ వంటి భారీ అంచనాలున్న పిస్టల్ షూటర్లు తీవ్రంగా తడబడిన వేళ తీవ్రమైన పోటీలో నెగ్గిన ఆ రజతమే స్వర్ణసమానమైంది. హైదరాబాద్ వెటరన్ షూటర్ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో నీరూ ధండాతో స్వర్ణం అందుకున్నాడు.