చిట్యాల, ఫిబ్రవరి 27 : రైతులకు సాగునీరు అందక నిల్వ ఉన్న నీటి కోసం గుర్తుతెలియని వ్యక్తులు చెక్ డ్యామ్‌కు గండికొట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి నవాబుపేట శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సాగునీరు అందించేందుకు, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు నవాబుపేట శివారులో రూ.10 కోట్లతో చలి వాగుపై చెక్ డ్యామ్ నిర్మించారు.
దిగువన టేకుమట్ల మండల రైతులకు ఇదే చలి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చలివాగులో సాగుకు సరిపడా సాగునీరు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎగువన ఉన్న చెక్ డ్యామ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టి దిగువ ఉన్న రైతులకు నీటిని మళ్లిస్తున్నారు.
ఘటనపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులే రైతుల మధ్య చిచ్చుపెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. టేకుమట్ల మండలానికి చెందిన అధికార పార్టీ ప్రధాన నాయకుడు వారం రోజులుగా మకాం వేస్తూ ట్రాక్టర్ క్రషర్ సాయంతో చెక్‌డ్యామ్‌ను బ్లాస్టింగ్ చేసినట్టు ఆయకట్టు పరీవాహక రైతులు చర్చించుకుంటున్నారు.
అధికారంలో ఉండి సాగునీరు తెప్పించుకోవాలి కానీ మిగతా రైతులను బ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు.చెక్‌డ్యామ్ సిమెంట్ కాంక్రీటుకు గండి కొట్టిన వ్యక్తులను ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు పిట్ట సురేశ్, ఏరుకొండ రాజేందర్, టీ నవీన్ డిమాండ్ చేశారు. గురువారం చెక్‌డ్యామ్‌ను సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.