హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఘర్షణలకు గాంధీభవన్ వేదికగా మారింది. ఇప్పటికే ముషీరాబాద్, మలక్‌పేట్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నేతల మధ్య జరిగిన గొడవలను మర్చిపోకముందే.. తాజాగా జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఏ చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు సోమవారం గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంస్థాగత నియామకాల నేపథ్యంలో చంద్రశేఖర్ తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రత్యర్థి వర్గం(మదన్మోహన్-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే) ఆరోపిస్తున్నది. ఎన్నో ఏండ్లుగా ఉన్న వారిని కాదని, కొత వారికి పదవులు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా నినదించారు. చంద్రశేఖర్‌ను ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.