Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. వారం రోజుల కిందట ప్రధాన రహదారుల వెంట మార్కింగ్ చేసిన అధికారులు మంగళవారం నాడు పోలీసుల సహకారంతో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించకుండా కేవలం ఫుట్‌పాత్‌ల వద్ద ఉన్న బోర్డులు, షెడ్లు మాత్రమే తొలగించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.
వారం కిందట ప్రధాన రహదారుల వెంట మార్కింగ్ చేసిన మున్సిపల్ అధికారులు.. షాపుల యజమానులు, తోపుడు బండ్ల వ్యాపారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు.. అలాగే భీంనగర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన షెడ్లు, తోపుడు బండ్లు, ఇతర సామగ్రిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలవని సూచించారు. అయినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు.
పాదచారులకు ఇబ్బందిగా మారిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నప్పటికీ.. మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేపట్టకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుకాణాల ముందు ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించి, చర్యలు తీసుకున్నామని మున్సిపల్ అధికారులు చెప్పుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. ఆక్రమణల తొలగింపులో అందరికీ ఒకే నిబంధనలు వర్తించాలని.. మార్కింగ్ చేసిన ప్రాంతాలను పూర్తిగా తొలగించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు.