హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్చిట్ ఇచ్చారు. కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరినట్టు నిరూపించేందుకు ఆధారాలు లేవని పేర్కొన్నారు. సంజయ్‌కుమార్ ఇప్పటీకీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వీరంతా కూడా కాంగ్రెస్‌లో చేరినట్టు ఆధారాలు లేవంటూ వారిపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను కొట్టేశారు. తాజాగా సంజయ్ విషయంలోనూ అదే తీర్పు వెలువరించడంతో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. కండ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ వాటిని స్పీకర్ పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా సీఎం ఇంటికి వెళ్లి ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పించుకొని పార్టీలో చేరిన విషయం టీవీ చానళ్లు, వార్తా పత్రికల్లో ప్రచురితమైందని, అవి స్పీకర్‌కు కనిపించ లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 21న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్‌పై మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని గాంధీభవన్‌లో నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా హాజరయ్యారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొనడాన్ని నిరసిస్తూ జీవన్‌రెడ్డి ఆ సమావేశాన్ని బహిష్కరించారు. ఇది కూడా స్పీకర్ దృష్టికి రాలేదా? అంటూ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇస్తున్న తీర్పులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేననే రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంజయ్‌కి స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన కాంగ్రెస్ నేతల మధ్య కూర్చొని తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం కొసమెరుపు.
మరో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విచారణను స్పీకర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకు 8 మందికి స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. దానం నాగేందర్ గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి పలుమార్లు తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనే కోరుతానని బహిరంగంగానే ప్రకటించారు. మరి ఈ ఇద్దరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది.