Gaddam Nagaraju | మొన్నటి వరకు బీజేపీలో ఉన్న గడ్డం నాగరాజు బీఆర్ఎస్లో చేరడానికి కారణం?
బీజేపీలో బీసీ, దళిత నాయకులను ఎదగనివ్వరు. ఒకరో, ఇద్దరో పైకి వచ్చినా.. అది కూడా అధిష్ఠానం అవసరం కోసం మాత్రమే వారికి అవకాశం ఇస్తారు. 32 ఏండ్లు పార్టీ కోసం పనిచేసిన నాకు సరైన గుర్తింపునివ్వలేదు, పైగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. అందుకే.. పార్టీని విడిచిపెట్టాను.
బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అవకాశం ఇవ్వకపోవడం గురించి మీరేం చెప్తారు?
అది వాళ్ల ఖర్మ అంటాను. మరో రకంగా చెప్పాలంటే నా అదృష్టం అని కూడా అంటాను. ఒకవేళ అదే పార్టీలో ఉంటే.. ఒక మంచి విజన్ ఉన్న లీడర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రాకపోతుండెనేమో. నాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకుడిని కోల్పోవడం బీజేపీ దురదృష్టం. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని అదృష్టంగా భావిస్తున్నా.
బీఆర్ఎస్ అభ్యర్థి రసమయితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజా స్పందన ఎలా ఉన్నది?
కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవల్లో అందరికీ అందాయి. నేను కూడా ఆశ్చర్యపోయా. ప్రజలు స్వచ్ఛందంగా ‘మీరు ఎందుకొస్తున్నరు బిడ్డా..? కారుకే ఏస్తం పోర్రి’ అని చెప్తున్నరు. ఒక నాయకుడి మీద ఇంత నమ్మకం ఉండటం చాలా గొప్ప విషయం.
రాష్ట్రంలో బీజేపీ ప్రచారం గురించి మీ కామెంట్?
ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా.. ‘కేసీఆర్‌ను దించేస్తాం.. బీఆర్ఎస్ను ముంచేస్తాం!’ అని కాంగ్రెస్, బీజేపీ ప్రగల్భాలు పలుకుతున్నాయి. నిజం చెప్పాలంటే రెచ్చగొట్టడం తప్పితే.. ప్రజలకు మేలు చేద్దామని ఏ కోశానా లేదు. ఆ రెండు పార్టీలు ప్రజలను ముంచేవే!
ప్రజలు ఏ మ్యానిఫెస్టో నమ్ముతారంటారు?
ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన మ్యానిఫెస్టోని బీజేపీ, కాంగ్రెస్‌లు మేము ఇది చేస్తాం అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది. ఆల్రెడీ చేసినవి కాకుండా.. రాబోయే కాలంలో ఏం చేస్తాం అని చెప్పే మ్యానిఫెస్టోతో ముందుకెళ్తున్నాం. మా మ్యానిఫెస్టోకు పోటీ లేదు.
ప్రజలను మభ్యపెట్టేలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ మీద జరుగుతున్న విషప్రచారం గురించి మీరేం చెప్తారు?
ఆ విషయం అందరి కంటే ముందు ప్రజలకు చాలా క్లియర్‌గా తెలుసు. ఎవరు మసిపూసి మారేడుకాయను చూపిస్తున్నారో.. ఎవరు వాస్తవాలను చెప్తున్నారో గమనిస్తున్నారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అన్నింటికీ సమాధానం డిసెంబర్ 3న వస్తుంది.