రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్‌రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలి.. కాంగ్రెస్ పోవాలి’ అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్మించిన జీవనధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరితంగా వ్యవహరించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదని, దాని ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు ఇవ్వడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిందని చెప్పారు. ఈ నెల 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఆయన మొదటిసారిగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆయనకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. తమ్మిడిహట్టి వద్ద ఆశించిన నీటి లభ్యత లేకపోవడం, మేడిగడ్డ వద్ద పుష్కలంగా నీటి లభ్యత ఉండడంతో జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ అనుమతులకు అనుగుణంగా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంతో నిర్మాణం చేపట్టారని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కాదని ఎల్లంపల్లి, నందిమేడారం, ఎల్ఎండీ, మిడ్ మానేరు, వరదకాలువ, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్తోపాటు వందకుపైగా కాంపోనెట్స్ ఉన్నాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. వీటిలో మేడిగడ్డ ఒకటని.. ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు వ్యయమైందని పేర్కొన్నారు. ఈ బ్యారేజీలో కేవలం రెండు పిల్లర్లకు ఇసుక సాంద్రతతో పాటు సాంకేతిక సమస్యలతో క్రాక్ వచ్చిందని చెప్పారు.
దీని మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చు సైతం ఎల్అండ్ టీ సంస్థనే భరిస్తామని చెప్పినా కాంగ్రెస్ ప్రభు త్వం మరమ్మతులు చేయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రి పోర్టు వచ్చి సంవత్సరం గడిచినా సాయిల్ టెస్ట్ చేయలేదని మండిపడ్డారు. గత పదేండ్లలో కేసీఆర్ రాష్ర్టాన్ని జాతీయ స్థాయిలో నంబర్‌వన్‌గా నిలిపితే.. రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పోతున్నదని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి గూ డూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.