హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 3 ట్రిలియన్ డాలర్లకు పెంపొందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, అందులో భాగంగా సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు.
ప్రజాభవన్లో శుక్రవారం ఆయన డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జేఎల్ఎల్ తదితర కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విద్య, నైపుణ్యాలు, ఉపాధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అదే నిబద్ధత తెలంగాణ రైజింగ్-2047లో ప్రతిబింబిస్తుందని భట్టి పేర్కొన్నారు. శుక్రవారం జేఎన్టీయూ వజ్రోత్సవాలకు ఆయన హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మైనింగ్శాఖతో సమన్వయం చేసుకుంటూ వాహనాల్లో ఓవర్లోడ్ లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. సచివాలయంలో శుక్రవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,748 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలపై కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. రవాణా శాఖలో ఖాళీలు భర్తీ చేయడంతోపాటు, ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.