Ration Cards | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ నెలలోనే కొత్తకార్డులు జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. క్యూఆర్ కోడ్‌తో కూడి న కొత్త కార్డుల ముద్రణ కోసం పౌరసరఫరాల శాఖ బుధవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. దీంతో టెండర్లు పూర్తయ్యేదెప్పుడు, కొత్త కార్డులు ముద్రణ ప్రారంభమయ్యేదెప్పుడు, వాటిని లబ్ధిదారులకు ఇచ్చేదెప్పుడు అనే ప్రశ్న లు వ్యక్తమవుతున్నాయి. టెండర్ తేదీలను పరిశీలిస్తే ఈ నెలలో కొత్త కార్డులు వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్‌లో అయినా కార్డులు సిద్దమవుతాయో లేదో తెలియడం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. 15 నెలలు గడుస్తు న్నా ఇప్పటివరకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. జనవరి 26న కొత్త రేషన్‌కార్డుల జారీని సీఎం రేవంత్ ప్రారంభించారు. అంతకుముందు గ్రామ సభలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. లబ్ధిదారుల ను కూడా ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇక రేషన్‌కార్డులు రావడమే ఆలస్యమనే ఆలోచనలో ప్రజలున్నా రు. తీరా మళ్లీ మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మరో మెలిక పెట్టింది. నాలుగుసార్లు దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం కార్డులను మాత్రం జారీ చేయలేకపోయింది. తీరా ఇప్పుడు స్మార్ట్‌కార్డుల పేరుతో ప్రభుత్వం కొత్త పాట పాడుతున్నది. దీంతో రేషన్‌కార్డుల జారీని మరింత ఆలస్యం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.