Group Exams | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలు నిలిచిపోవడంతో కొత్త చిక్కొచ్చిపడింది. మరో సమస్యనూ తెచ్చిపెట్టింది. ఇది గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారింది. మెయిన్స్‌పై హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించడంతో గ్రూప్ -1 నియామకాలకు బ్రేక్‌పడింది. దీంతో ఈ నియామకాలే కాకుండా పరోక్షంగా గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీ కూడా ఆగిపోయినట్టే. గ్రూప్-1పై ఏదో ఒకటి తేలితేనే గ్రూప్-2, గ్రూప్ -3 పోస్టు భర్తీ కొలిక్కిరానున్నది. 783 పోస్టులతో గ్రూప్ -2, 1,388 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటికి అన్ని పరీక్షలను నిర్వహించగా, ఇటీవలే ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
ఈ మేరకు గ్రూప్-2, గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) కూడా విడుదలైంది. దాని ఆధారంగా పోస్టులు, రోస్టర్ ప్రకారం మెరుగైన ప్రతిభ సాదించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉన్నది. గ్రూప్-1, గ్రూప్-2 రెండింటిలో ఉన్న వారు 100 మందికి పైగా ఉండగా, గ్రూప్-2, గ్రూప్-3 రెండింటిలో వారు 600 మందికి పైగా అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. మొత్తంగా గ్రూప్-1 పోస్టులు నింపితేనే, ఆ రెండు ముందుకు కదిలే అవకాశం ఉండటంతో గ్రూప్-2, గ్రూప్-3 టాపర్లల్లో టెన్షన్ పట్టుకున్నది.